Let's talk: editor@tmv.in
2026-27లో భారత వృద్ధి 6.3 శాతం: ఎస్‌ అండ్‌ పీ అంచనా

2026-27లో భారత వృద్ధి 6.3 శాతం: ఎస్‌ అండ్‌ పీ అంచనా

Shaik Mohammad Shaffee
17 ఏప్రిల్, 2026

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు చుక్కలను తాకినా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథంలోనే దూసుకుపోతుందని ప్రముఖ రేటింగ్ సంస్థ 'ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్' స్పష్టం చేసింది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఒకవేళ 2026-27 ఆర్థిక సంవత్సరంలో చమురు ధర సగటున బ్యారెల్‌కు 130 డాలర్లకు చేరినప్పటికీ, భారత్ 6.3 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని అంచనా వేసింది. గురువారం నిర్వహించిన వెబినార్‌లో ఎస్‌ అండ్‌ పీ డైరెక్టర్ యీ ఫార్న్ ఫువా మాట్లాడుతూ.. ప్రపంచంలోని ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా తన స్థానాన్ని పదిలం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

ప్రతికూలతలను తట్టుకొని..

ముడి చమురు ధర బ్యారెల్‌కు 85 డాలర్లుగా ఉంటే భారత్ 7.1 శాతం వృద్ధి సాధిస్తుందని తమ ప్రాథమిక అంచనా అని ఎస్‌ అండ్‌ పీ తెలిపింది. ఒకవేళ యుద్ధం వంటి ప్రతికూల పరిస్థితుల వల్ల చమురు ధరలు 130 డాలర్లకు పెరిగినా, భారత్ వృద్ధి 6.3 శాతానికి తగ్గదని పేర్కొంది. అయితే చమురు ధరల పెరుగుదల వల్ల కరెంట్ ఖాతా లోటు పెరగడం, ఉత్పత్తి వ్యయాలు భారం కావడం, వినియోగదారుల కొనుగోలు శక్తి తగ్గడం వంటి సవాళ్లు ఎదురవుతాయని హెచ్చరించింది. ఇంధన సరఫరాలో అంతరాయం కలిగితే అది ఎరువుల వంటి అనుబంధ రంగాల పైనా ప్రభావం చూపుతుందని విశ్లేషించింది.

ఆర్థిక క్రమశిక్షణే రక్ష

ఇంధన ధరల షాక్ వల్ల భారత్ సార్వభౌమ క్రెడిట్ రేటింగ్‌పై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని ఎస్‌ అండ్‌ పీ భరోసా ఇచ్చింది. ద్రవ్యలోటును కట్టడి చేసే విషయంలో భారత ప్రభుత్వం చూపుతున్న పట్టుదల, రాజకీయ నిబద్ధత ఇందుకు ప్రధాన కారణమని కొనియాడింది. సామాన్యులపై భారం పడకుండా సబ్సిడీల కోసం ఖర్చు పెరిగినప్పటికీ, ప్రభుత్వం మౌలిక సదుపాయాల వంటి ఇతర విభాగాల్లో వ్యయాన్ని సర్దుబాటు చేసుకుంటూ ద్రవ్యలోటు లక్ష్యానికి కట్టుబడి ఉంటుందని పేర్కొంది. ఖర్చుల సర్దుబాటులో భారత్ వద్ద ఉన్న వెసులుబాటు దేశ ఆర్థిక స్థిరత్వానికి వెన్నెముకగా నిలుస్తుందని నివేదిక వివరించింది.