Let's talk: editor@tmv.in
ఖనిజ రంగంలో మరో ఏడాదిలో భారత్ ఘన విజయం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఖనిజ రంగంలో మరో ఏడాదిలో భారత్ ఘన విజయం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Gaddamidi Naveen
29 మే, 2026

వ్యూహాత్మక ఖనిజాల రంగంలో భారతదేశం రాబోయే 12 నెలల్లో (మరో ఏడాదిలో) అత్యంత కీలకమైన మైలురాళ్లను అధిగమించబోతోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి గురువారం ప్రకటించారు. ఉపరితల బొగ్గు, లిగ్నైట్ గ్యాసిఫికేషన్ రోడ్‌షో సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ సమన్వయ విధానం వల్ల దేశంలో వనరుల భద్రత వేగంగా అభివృద్ధి చెందుతోందని స్పష్టం చేశారు.

‘నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్’ కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కొత్త మైనింగ్ బ్లాకులను గుర్తించడం, అన్వేషణ, వేలం ప్రక్రియలను వేగవంతం చేసిందని మంత్రి తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారిగా ఈ ఏడాది పెద్ద సంఖ్యలో అత్యంత కీలకమైన ఖనిజాల బ్లాకులను విజయవంతంగా వేలం వేసినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు.

వ్యూహాత్మక ఖనిజాల సరఫరాను భద్రపరచడానికి భారతదేశం ఇప్పటికే పలు దేశాలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుందని మంత్రి చెప్పారు. ముఖ్యంగా అమెరికాతో కుదుర్చుకున్న ప్రత్యేక ఒప్పందం గురించి ప్రస్తావిస్తూ.. భారత ప్రధానమంత్రి అమెరికా పర్యటనలో, అలాగే అమెరికా మంత్రి భారత్‌కు వచ్చినప్పుడు ఈ రంగంలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై చర్చలు జరిగాయన్నారు. అంతేకాకుండా, దీర్ఘకాలిక వనరుల భద్రత కోసం భారత్ విదేశాల్లోనూ ఖనిజ వనరులను కొనుగోలు చేస్తోందని, అందులో భాగంగా అర్జెంటీనా వంటి దేశాలలో క్రిటికల్ మినరల్ బ్లాకులను దక్కించుకుందని వెల్లడించారు.

నాలుగు రాష్ట్రాల్లో ప్రాసెసింగ్ ప్లాంట్లు

ఎలక్ట్రానిక్స్, బ్యాటరీలు, పునరుత్పాదక ఇంధనం, అధునాతన ఉత్పాదక రంగాలకు అవసరమైన రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఈ మిషన్ కింద మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలలో క్రిటికల్ మినరల్ ప్రాసెసింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇందుకోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే స్థలాలను కేటాయించి, కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ కార్యాచరణ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయని తెలిపారు. గనుల శాఖ, వాణిజ్య శాఖ, పరిశ్రమల శాఖలు ఉమ్మడిగా ఈ ప్లాంట్ల ఏర్పాటుకు మద్దతు ఇస్తున్నాయన్నారు.

దేశీయ అన్వేషణ విషయానికొస్తే.. రాజస్థాన్‌లో భారీగా క్రిటికల్ మినరల్ నిల్వలు ఉన్నట్లు నివేదికలు వచ్చాయని, తూర్పు భారతదేశంలోనూ వీటి అన్వేషణను విస్తృతం చేశామని చెప్పారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తో పాటు ప్రైవేట్ కంపెనీలు, స్టార్టప్ సంస్థలను కూడా ఈ అన్వేషణ ప్రక్రియలో ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు.