
ఈ ఏడాది భారత ఆర్థిక వృద్ధి 6.4 శాతం: ఐరాస అంచనా
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య సవాళ్ల మధ్య కూడా భారత ఆర్థిక వ్యవస్థ తన జోరును కొనసాగిస్తోంది. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో భారత్ 6.4 శాతం వృద్ధి రేటును నమోదు చేయనుందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక వెల్లడించింది. 'ఎకనామిక్ అండ్ సోషల్ సర్వే ఆఫ్ ఆసియా అండ్ పసిఫిక్ 2026' పేరుతో విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం.. భారత్ వచ్చే ఆర్థిక ఏడాది (2027-28 ఆర్థిక సంవత్సరం)లో 6.6 శాతం వృద్ధిని సాధించనుందని అంచనా వేసింది.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థే కీలకం
2025లో భారత్ 7.4 శాతం వృద్ధిని సాధించడానికి ప్రధాన కారణం గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన వినియోగం అని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రజల కొనుగోలు శక్తిని పెంచిందని, అమెరికా విధించనున్న సుంకాలను దృష్టిలో ఉంచుకుని ముందే ఎగుమతులు చేయడం కూడా కలిసొచ్చిందని నివేదిక తెలిపింది. ఇక సామాన్యులకు ఊరటనిచ్చే అంశం ఏమిటంటే.. ఈ ఏడాది ధరల పెరుగుదల (ద్రవ్యోల్బణం) 4.4 శాతంగానే ఉండొచ్చని, వచ్చే ఏడాది 4.3 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది.
అమెరికా ఆంక్షల ప్రభావం
గత ఏడాది ఆగస్టులో అమెరికా 50 శాతం టారిఫ్‌లను విధించడం వల్ల అక్కడికి జరిగే భారత ఎగుమతులు 25 శాతం తగ్గినట్లు నివేదిక గుర్తుచేసింది. దీనివల్ల 2025 రెండో భాగంలో ఆర్థిక కార్యకలాపాలు కాస్త నెమ్మదించాయి. అయినప్పటికీ, సేవా రంగం దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టిందని ఐరాస తెలిపింది.
నగదు పంపిణీపై పన్ను భారం
విదేశాల్లో పనిచేస్తున్న భారతీయులు స్వదేశానికి పంపే సొమ్ము (రెమిటెన్స్‌లు) విషయంలో భారత్ ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉంది. 2024లో భారతీయులు ఏకంగా 137 బిలియన్ డాలర్లను స్వదేశానికి పంపారు. అయితే 2026 జనవరి నుంచి అమెరికా ఈ రెమిటెన్స్‌లపై 1 శాతం పన్ను విధించడం వల్ల భారత్ కొంత నష్టపోయే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది. భారత్‌లో ఈ నగదులో 40 శాతం వైద్య అవసరాలు, నిత్యావసరాలకే వాడుతుండటం గమనార్హం.
పెట్టుబడుల జోరు.. ఉపాధి హోరు
ప్రపంచవ్యాప్తంగా విదేశీ పెట్టుబడులు తగ్గుతున్నప్పటికీ, భారత్ మాత్రం కొత్త పరిశ్రమల స్థాపన కోసం సుమారు 50 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించి అగ్రస్థానంలో నిలిచింది. పర్యావరణానికి మేలు చేసే 'గ్రీన్ జాబ్స్' కల్పనలోనూ 13 లక్షల ఉద్యోగాలతో దేశం మెరుగైన ఫలితాలు సాధించింది. ముఖ్యంగా సోలార్ ప్యానెళ్లు, బ్యాటరీల తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తెచ్చిన పీఎల్ఐ పథకం వల్ల విదేశీ దిగుమతులు తగ్గి, దేశీయ పరిశ్రమలు బలోపేతం అవుతున్నాయని ఐక్యరాజ్యసమితి ప్రత్యేకంగా కొనియాడింది.
