Let's talk: editor@tmv.in
భారతీయ ఫోటోగ్రఫీ దిగ్గజం రఘురాయ్‌ కన్నుమూత
భారతీయ ఫోటోగ్రఫీ దిగ్గజం రఘురాయ్‌ కన్నుమూత

భారతీయ ఫోటోగ్రఫీ దిగ్గజం రఘురాయ్‌ కన్నుమూత

Pinjari Chand
27 ఏప్రిల్, 2026

భారతదేశపు సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక వైవిధ్యాన్ని తన కెమెరా కళ్లతో అద్భుతంగా పట్టి ప్రపంచానికి చూపించిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ రఘు రాయ్ (83) ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన మరణంతో భారతీయ ఫోటో జర్నలిజం రంగం ఒక మహా శిఖరాన్ని కోల్పోయింది. రఘు రాయ్ గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. మొదట ప్రోస్టేట్ క్యాన్సర్‌గా గుర్తించిన ఈ వ్యాధి తరువాత కడుపుకు, తాజాగా మెదడుకు వ్యాపించడంతో పాటు వయోభార సమస్యలు కూడా కలవడంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఆయనకు భార్య గుర్మీత్, కుమారుడు నితిన్, కుమార్తెలు లగన్, అవని, పూర్వై ఉన్నారు.

23 ఏళ్ల వయస్సులో

1942 డిసెంబర్ 18న అప్పటి పంజాబ్‌లోని జంగ్ (ప్రస్తుతం పాకిస్తాన్‌లో) జన్మించిన రాయ్, సివిల్ ఇంజనీర్‌గా చదువుకున్నారు. అయితే 23 ఏళ్ల వయసులో ఫోటోగ్రఫీ వైపు మళ్లి, 1966లో ‘ది స్టేట్స్‌మెన్‌’ పత్రికలో చీఫ్ ఫోటోగ్రాఫర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి దాదాపు ఆరు దశాబ్దాలపాటు ఆయన కెమెరా భారతదేశం మార్పులను, సంఘటనలను స్పష్టంగా లిఖించింది.

ఫ్రెంచ్ ఫోటోగ్రాఫర్ హెన్రీ కార్టియర్‌‌–బ్రెస్సెన్‌ శిష్యుడిగా

ఫ్రెంచ్ ఫోటోగ్రాఫర్ హెన్రీ కార్టియర్‌‌–బ్రెస్సెన్‌ శిష్యుడైన రాయ్, భారత ఆధునిక చరిత్రలో కీలక సంఘటనలను తన కెమెరాలో బంధించారు. 1972 బంగ్లాదేశ్ శరణార్థి సంక్షోభం, 1984 భోపాల్‌ గ్యాస్‌ ట్రాజెడీ వంటి ఘటనల చిత్రాలు ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. అలాగే ఆయన తీసిన ప్రముఖుల చిత్రాలు కూడా విశేషంగా నిలిచాయి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, దలైలామా, మదర్ థెరిస్సా, దర్శకుడు సత్యజిత్‌రే, సంగీత విద్వాంసులు హరిప్రసాద్‌ చౌరాసియా, బిస్మిల్లా ఖాన్‌ వంటి వారి జీవితాల్లోని అరుదైన కోణాలను ఆయన ఫోటోలు ప్రతిబింబించాయి. సాధారణ మనుషుల జీవనశైలిని కూడా ఆయన కెమెరా అంతే సున్నితంగా చూపించింది. ముఖ్యంగా వారణాసి నగరంపై ఆయనకు ప్రత్యేక ఆకర్షణ ఉండేది. గంగాఆరతి నుంచి దహన సంస్కారాల వరకు అక్కడి జీవనశైలిని ఆయన అద్భుతంగా చిత్రీకరించారు.

అనేక అంతర్జాతీయ పురస్కారాలు.. పద్మశ్రీ

తన కెరీర్‌లో రాయ్ సండే, ఇండియా టుడే వంటి ప్రముఖ పత్రికలతో పని చేశారు. అంతర్జాతీయంగా టైమ్‌, లైఫ్‌, ది న్యూయర్క్‌ టైమ్స్‌, ది న్యూ యార్కర్‌‌ వంటి పత్రికల్లో ఆయన ఫోటో ఎస్సేలు ప్రచురితమయ్యాయి. 1977లో మ్యాగ్నమ్ ఫోటోస్‌లో చేరడానికి కూడా ఆయనను ఎంపిక చేశారు. 1972లో బంగ్లాదేశ్ యుద్ధ కవరేజీకి గాను ఆయనకు పద్మశ్రీ పురస్కారం లభించింది. అలాగే అమెరికాలో “ఫోటోగ్రాఫర్‌‌ ఆఫ్‌ ది ఇయర్‌‌’ అవార్డు, ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి ఆఫీసర్‌‌ డెస్ ఆర్ట్స్‌ ఎట్‌ డెస్‌ లెటర్స్‌ గౌరవం వంటి అనేక పురస్కారాలు అందుకున్నారు. ఫోటోగ్రఫీ అనేది మనం జీవిస్తున్న కాలాన్ని పట్టుకోవడం అనే తత్వంతో పనిచేసిన రాయ్, విజువల్ హిస్టరీని సృష్టించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆయన తీసిన చిత్రాలు భవిష్యత్తు తరాలకు చరిత్రగా నిలుస్తాయని ఆయన నమ్మకం.

ప్రముఖుల నివాళి

రాయ్ మరణంపై దేశవ్యాప్తంగా రాజకీయ, సాంస్కృతిక రంగాల నుంచి నివాళులు వెల్లువెత్తాయి. రాహుల్‌గాంధీ ఆయనను ‘దేశ జ్ఞాపకాలను కాపాడిన వ్యక్తి”గా కొనియాడగా, శశి థరూర్‌‌ ఆయన ఫోటోగ్రఫీ కృషిని ‘అప్రతిమం’గా అభివర్ణించారు. నవీన్‌ పట్నాయక్‌ ఆయన చిత్రాలను ‘కళ్లముందు ఉన్న సజీవ చిత్రాలు’గా పేర్కొన్నారు. రఘు రాయ్ అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలోని లోధి శ్మశానవాటికలో నిర్వహించనున్నారు. ఆయన వెనుక వదిలిన వేలాది చిత్రాలు, పుస్తకాలు భారతదేశపు ఆత్మను ప్రతిబింబించే చిరస్థాయిగా నిలిచిపోతాయి.