Let's talk: editor@tmv.in
శ్రీలంకలో భారత గృహ ప్రాజెక్ట్‌: లబ్ధిదారులతో ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ భేటీ
శ్రీలంకలో భారత గృహ ప్రాజెక్ట్‌: లబ్ధిదారులతో ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ భేటీ
శ్రీలంకలో భారత గృహ ప్రాజెక్ట్‌: లబ్ధిదారులతో ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ భేటీ

శ్రీలంకలో భారత గృహ ప్రాజెక్ట్‌: లబ్ధిదారులతో ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ భేటీ

Dantu Vijaya Lakshmi Prasanna
21 ఏప్రిల్, 2026

భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం శ్రీలంకకు వెళ్లారు. భారత ఉపరాష్ట్రపతి స్థాయి వ్యక్తి శ్రీలంకలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ పర్యటనలో భాగంగా ఆయన శ్రీలంకలోని భారతీయ సంతతికి చెందిన తమిళులతో మమేకమయ్యారు. సోమవారం ఆయన శ్రీలంకలోని మధ్య ప్లాంటేషన్ జిల్లా అయిన నువారా ఎలియాను సందర్శించారు. అక్కడ లిడిల్స్‌డేల్ ఎస్టేట్ వద్ద భారత ఆర్థిక సహాయంతో నిర్మించిన గృహాల లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. శ్రీలంకలోని తమిళ ప్రజల సంక్షేమం పట్ల భారత ప్రభుత్వం, ప్రజలకు ఉన్న లోతైన నిబద్ధతను ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు.

నాలుగో దశలో భాగంగా మరో 10,000 ఇళ్లను నిర్మిస్తామని హామీ

భారత గృహ నిర్మాణ ప్రాజెక్ట్ కింద శ్రీలంకలో ఇప్పటివరకు సాధించిన పురోగతిని ఉపరాష్ట్రపతి వివరించారు. ఉత్తర, తూర్పు ప్రాంతాలతో పాటు ప్లాంటేషన్ ప్రాంతాల్లోని తమిళ కుటుంబాల కోసం భారత్ ఇప్పటివరకు 50,000 ఇళ్లను నిర్మించి ఇచ్చిందని ఆయన తెలిపారు. తాజాగా మూడవ దశలో భాగంగా తోట కార్మికుల కోసం కేటాయించిన 4,000 ఇళ్లలో మిగిలి ఉన్న 145 గృహాల నిర్మాణాన్ని పూర్తి చేసి, లబ్ధిదారులకు అందజేశారు. దీనితో మూడవ దశ విజయవంతంగా ముగిసింది. అలాగే, నాలుగో దశలో భాగంగా మరో 10,000 ఇళ్లను నిర్మించనున్నట్లు ఆయన ప్రకటించారు. సుమారు 1,835 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్, విదేశాల్లో భారత్ చేపట్టిన అతిపెద్ద గ్రాంట్ ప్రాజెక్టులలో ఒకటిగా నిలిచింది.

'సిలోన్ ఎస్టేట్ వర్కర్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్' స్కాలర్‌షిప్ పెంపు

విద్యారంగంలో సహకారంపై శ్రీలంక ప్రధాని, విద్యాశాఖ మంత్రి హరిణి అమరసూర్యతో ఉపరాష్ట్రపతి కీలక చర్చలు జరిపారు. ఇందులో భాగంగా 'సిలోన్ ఎస్టేట్ వర్కర్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్' స్కాలర్‌షిప్ పథకాన్ని గణనీయంగా పెంచుతున్నట్లు ప్రకటించారు. స్కాలర్‌షిప్‌ల సంఖ్యను 350 నుండి 700కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే విద్యార్థులకు ఇచ్చే నెలవారీ స్టైపెండ్‌ను ఏ-లెవల్ విద్యార్థులకు 2,500 ఎల్.కె.ఆర్ నుంచి ఉన్నత విద్యను అభ్యసించే వారికి 7,500 ఎల్.కె.ఆర్ కు పెంచారు. ఈ నిర్ణయం ప్లాంటేషన్ ప్రాంతాల్లోని పేద తమిళ విద్యార్థుల ఉన్నత చదువులకు ఎంతో ఊతమిస్తుంది.

డయాస్పోరా (విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు) ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఇప్పటివరకు నాలుగో తరం వరకు మాత్రమే పరిమితమై ఉన్న 'ఓవర్సీస్ సిటిజన్ కార్డ్' సౌకర్యాన్ని, ఇకపై ఐదు, ఆరో తరాలకు కూడా పొడిగిస్తున్నట్లు ఉపరాష్ట్రపతి వెల్లడించారు. ఈ నిర్ణయం శ్రీలంకలోని భారతీయ సంతతి తమిళులకు ప్రధానంగా లబ్ధి చేకూరుస్తుంది. దీనివల్ల వారు తమ మూలాలతో మరింత బలంగా ముడిపడి ఉండే అవకాశం కలుగుతుంది. తమిళ పార్టీల నేతలతో జరిగిన సమావేశంలో ఈ ప్రకటన వెలువడింది.

భారత్, శ్రీలంకల మధ్య చమురు పైప్‌లైన్ అనుసంధానం

శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సానాయకేతో జరిగిన సమావేశంలో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలపై చర్చలు జరిగాయి. ముఖ్యంగా భారత్, శ్రీలంకల మధ్య ప్రతిపాదిత చమురు పైప్‌లైన్ అనుసంధానంపై వారు సుదీర్ఘంగా చర్చించారు. దీంతో పాటు ఇరు దేశాల మధ్య ఉన్న బహుముఖ ద్వైపాక్షిక సంబంధాలు, మత్స్యకారుల సమస్యలు, గృహ నిర్మాణ ప్రాజెక్టుల పురోగతిపై కూడా వారు దృష్టి సారించారు. ఇటీవల శ్రీలంకను వణికించిన 'దిత్వ' తుపాను విధ్వంసంపై రాధాకృష్ణన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆ సమయంలో భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సాగర్ బంధు' సహాయక చర్యల గురించి కూడా చర్చించారు.

సీతా అమ్మన్ ఆలయ దర్శనం

పర్యటన ముగింపులో భాగంగా, ఉపరాష్ట్రపతి సీతా ఎలియాలోని చారిత్రాత్మక సీతా అమ్మన్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామాయణ గాథతో ముడిపడి ఉన్న ఈ ప్రాంత సందర్శన సాంస్కృతిక సంబంధాలను ప్రతిబింబించింది. అనంతరం ఆయన కొలంబోకు చేరుకుని తిరిగి భారత్‌కు బయలుదేరారు. ఈ పర్యటన శ్రీలంకలోని తమిళుల సంక్షేమం పట్ల భారత్ చూపే శ్రద్ధను చాటిచెప్పడమే కాకుండా, దక్షిణాసియాలో పొరుగు దేశాల మధ్య సంబంధాలను మరింత పటిష్టం చేసింది. ఈ పర్యటన ద్వారా అటు సామాజికంగా, ఇటు రాజకీయంగా భారత్ తన బలమైన ఉనికిని చాటుకుంది.

శ్రీలంకలో భారత గృహ ప్రాజెక్ట్‌: లబ్ధిదారులతో ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ భేటీ - Tholi Paluku