
ఆసియా బీచ్ గేమ్స్‌లో భారత్‌కు 6 పతకాలు
చైనాలోని సాన్య వేదికగా జరిగిన ఆసియా బీచ్ గేమ్స్-2026లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. బుధవారం ముగిసిన పోటీల్లో భారత రెజ్లర్లు ఇసుక తిన్నెలపై తమ సత్తా చాటారు. ముఖ్యంగా మహిళా రెజ్లర్లు పుష్ప యాదవ్, ప్రియా మాలిక్ ప్రత్యర్థులపై విరుచుకుపడి స్వర్ణ పతకాలను ముద్దాడారు. మొత్తంగా ఈ క్రీడల్లో భారత్ మూడు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి మొత్తం ఆరు పతకాలను తన ఖాతాలో వేసుకుంది.
రెజ్లింగ్‌లో పట్టుబిగించిన వనితలు
మహిళల 60 కేజీల విభాగంలో భారత స్టార్ రెజ్లర్ పుష్ప యాదవ్ అద్వితీయ పోరాటాన్ని కనబరిచారు. ఫైనల్ పోరులో ఆసియా ఛాంపియన్, చైనాకు చెందిన షీ మెంగ్యును 3-0 తేడాతో చిత్తు చేసి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నారు. మరోవైపు 70+ కేజీల విభాగంలో ప్రియా మాలిక్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో మంగోలియాకు చెందిన బొలొర్టుంగలగ్‌పై 3-2తో విజయం సాధించి భారత్‌కు మరో స్వర్ణాన్ని అందించారు. 70 కేజీల విభాగంలో జస్ప్రీత్ కౌర్ సెమీఫైనల్లో ఓటమి పాలైనప్పటికీ, కాంస్య పతక పోరులో కజకిస్థాన్ అథ్లెట్ సీదులీపై 2-0తో గెలిచి మూడో స్థానంలో నిలిచారు.
పురుషుల విభాగంలో సిద్ధార్థ్‌కు రజతం
పురుషుల 70 కేజీల రెజ్లింగ్ విభాగంలో సిద్ధార్థ్ రజత పతకంతో మెరిశారు. సెమీఫైనల్‌లో దాయాది పాకిస్థాన్‌కు చెందిన మహమ్మద్ అబ్దుల్లాను 1-0తో ఓడించి ఫైనల్‌కు చేరిన సిద్ధార్థ్, స్వర్ణ పతక పోరులో ఇరాన్ రెజ్లర్ అలీ అక్బర్ జరౌదీ చేతిలో 0-3తో ఓడి రజతంతో సరిపెట్టుకున్నారు. దీంతో రెజ్లింగ్‌లోనే భారత్‌కు మొత్తం నాలుగు పతకాలు లభించాయి.
కబడ్డీలోనూ జోరు
రెజ్లింగ్ కంటే ముందే జరిగిన కబడ్డీ పోటీల్లోనూ భారత జట్లు తమ ఆధిపత్యాన్ని చాటుకున్నాయి. మహిళల కబడ్డీ జట్టు అజేయంగా నిలిచి పసిడి పతకాన్ని సాధించగా, పురుషుల జట్టు హోరాహోరీ పోరులో రజత పతకాన్ని సొంతం చేసుకుంది. వీటితో కలిపి భారత్ మొత్తం పతకాల సంఖ్య ఆరుకు చేరుకుంది. అయితే ఈ క్రీడల్లో భారత్ 3x3 బాస్కెట్‌బాల్, సెయిలింగ్ విభాగాల్లో కూడా బరిలోకి దిగినప్పటికీ, ఆయా క్రీడల్లో పతకాలు సాధించలేకపోయింది.
