Let's talk: editor@tmv.in
కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు 4 స్వర్ణాలు

కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు 4 స్వర్ణాలు

Shaik Mohammad Shaffee
29 ఏప్రిల్, 2026

అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ వేదికపై భారత క్రీడాకారులు మరోసారి సత్తా చాటారు. సమోవాలోని అపియాలో జరుగుతున్న 'కామన్వెల్త్ యూత్ అండ్ జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌'తో పాటు 'యూనివర్సల్ కప్ (సీనియర్)'లో భారత లిఫ్టర్లు పతకాల పంట పండించారు. పోటీల రెండో రోజైన మంగళవారం భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కనబరిచి, ఏకంగా నాలుగు స్వర్ణ పతకాలను తమ ఖాతాలో వేసుకున్నారు.

యూత్ అండ్ జూనియర్ విభాగాల్లో..

యూత్ అండ్ జూనియర్ విభాగాల్లో భారత యువ లిఫ్టర్లు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. పురుషుల 65 కిలోల విభాగంలో సునీల్ సింగ్ మొత్తం 271 కిలోల బరువును ఎత్తి అగ్రస్థానంలో నిలిచాడు. ఇందులో అతడు స్నాచ్‌లో 126 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 145 కిలోల బరువును విజయవంతంగా ఎత్తాడు. మహిళల 58 కిలోల విభాగంలో ఐసాంగ్ఫా గొగోయ్ పసిడి పతకాన్ని ముద్దాడింది. ఆమె మొత్తం 185 కిలోల (స్నాచ్ 79 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ 106 కేజీలు) బరువును ఎత్తి విజేతగా నిలిచింది. అదేవిధంగా పురుషుల 71 కిలోల విభాగంలో అభినవ్ గొగోయ్ తన అద్భుత ప్రదర్శనతో పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నారు. అభినవ్ మొత్తం 284 కిలోల (స్నాచ్ 129 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ 155 కేజీలు) బరువును ఎత్తి భారత కీర్తి పతాకాన్ని ఎగురవేశాడు.

యూనివర్సల్ కప్‌లో చారు పెసీ జోరు

మరోవైపు సీనియర్ కేటగిరీలో భాగంగా జరిగిన యూనివర్సల్ కప్‌లోనూ భారత జెండా రెపరెపలాడింది. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన చారు పెసీ పురుషుల 65 కిలోల విభాగంలో అద్భుతమైన ప్రతిభను చాటాడు. మొత్తం 289 కిలోల బరువును ఎత్తి స్వర్ణ పతక విజేతగా నిలిచాడు. పెసీ స్నాచ్ విభాగంలో 127 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో 162 కిలోల భారంతో ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలిచాడు.

హర్షం వ్యక్తం చేసిన ఐడబ్ల్యూఎఫ్

భారత వెయిట్‌లిఫ్టర్ల ఘనవిజయంపై భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య ( ఐడబ్ల్యూఎఫ్ ) అధ్యక్షుడు సహదేవ్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులు, కోచ్‌లు, సహాయక సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. క్రీడాకారుల కృషి, అంకితభావం వల్లే ఈ పతకాలు సాధ్యమయ్యాయని, ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ రంగంలో భారత్ ఒక శక్తివంతమైన దేశంగా ఎదుగుతోందని ఆయన కొనియాడారు. ఈ విజయాలు భవిష్యత్తులో భారత వెయిట్‌లిఫ్టింగ్‌కు మరిన్ని మెరుగులు దిద్దుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.