
ఉగ్రవాదానికి భారత్ తలవంచదు: ప్రధాని
గత ఏడాది ఇదే రోజున పహల్గామ్‌లో పాకిస్థాన్ మద్దతుతో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మంది అమాయకులకు ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. ఉగ్రవాదం ఎలాంటి రూపంలో వచ్చినా భారత్ ఎప్పటికీ తలవంచదని స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ప్రధాని స్పందిస్తూ ఆ దారుణ దాడిలో కోల్పోయిన ప్రాణాలను ఎప్పటికీ మర్చిపోలేం. బాధిత కుటుంబాల దుఃఖంలో దేశం అంతా భాగస్వామి. ఉగ్రవాదుల కుతంత్రాలు ఎన్నడూ ఫలించవని పేర్కొన్నారు. ఇండియన్ ఆర్మీ కూడా ‘ఆపరేషన్ సిందూర్’ను స్మరించుకుంది. అలాగే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ఆయా రాష్ర్టల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు పహల్గామ్ బాధితులకు నివాళి అర్పించారు.
పహల్గామ్ దాడి నేపథ్యం
2025 ఏప్రిల్ 22న పర్యాటక ప్రాంతంగా పేరుగాంచిన పహల్గామ్‌లోకి చొరబడ్డ పాకిస్థాన్ మద్దతు ఉగ్రవాదులు 26 మందిని హతమార్చారు. బాధితులను వారి మతం గురించి అడిగి టార్గెట్ చేసిన ఈ దాడి దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది.
ఆపరేషన్ సిందూర్
దాడి అనంతరం మే 7, 2025న భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి, పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల్లోని ఉగ్ర శిబిరాలపై దాడులు చేసింది. లష్కరే తోయిబా, జైష్ ఎ మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్‌లకు చెందిన తొమ్మిది ప్రధాన స్థావరాలను ధ్వంసం చేసినట్లు అధికారిక సమాచారం వెల్లడించింది. ప్రతిస్పందనగా పాకిస్థాన్ డ్రోన్ దాడులు, షెల్లింగ్ చేయడంతో నాలుగు రోజుల ఘర్షణ చోటుచేసుకుంది. అనంతరం మే 10న ఇరు దేశాల డీజీఎంఓల మధ్య చర్చలతో కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరింది.
దేశం ఐక్యంగా ఉంది: కాంగ్రెస్
దాడి జరిగి ఏడాది అయిన సందర్భంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా బాధితులకు నివాళులర్పించింది. దేశం అంతా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉందని పేర్కొంది. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ వారి త్యాగాన్ని భారత్ ఎప్పటికీ మర్చిపోదు, నేరస్తులను ఎప్పటికీ క్షమించదన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం దృఢంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో సైనికుల త్యాగాన్ని స్మరించారు.
కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అయితే కేంద్ర విదేశాంగ విధానంపై విమర్శలు చేశారు. 2008 ముంబై దాడుల తర్వాత ఒంటరైన పాకిస్థాన్‌కు ఇప్పుడు అంతర్జాతీయ గౌరవం లభించడం ప్రధాని విదేశాంగ వైఫల్యమని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా కూడా అమాయకులపై దాడిని దేశం ఎప్పటికీ మర్చిపోదని, నేరస్తులను క్షమించదని పేర్కొన్నారు. దేశం మొత్తం పహల్గామ్ బాధితులను స్మరించుకుంటూ, ఉగ్రవాదంపై పోరాటానికి సిద్ధంగా ఉన్నామని సంకల్పం వ్యక్తం చేసింది.
