
భారత్‌కు త్వరలో నాలుగో ఎస్-400 క్షిపణి వ్యవస్థ
భారత వాయుసేన రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా, రష్యా నుంచి నాలుగో ఎస్-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థ యూనిట్‌ను భారత్ వచ్చే నెల ప్రారంభంలో స్వీకరించనుంది. భారత్ 2018 అక్టోబరులో రష్యాతో సుమారు 5 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుని మొత్తం ఐదు యూనిట్లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. అందులో ఇప్పటికే మూడు యూనిట్లు దేశానికి అందాయి. భద్రతా వర్గాల సమాచారం ప్రకారం, నాలుగో యూనిట్ ఇప్పటికే రవాణా చేసింది. త్వరలో భారత్‌కు చేరుకునే అవకాశం ఉంది. ఐదో యూనిట్ నవంబర్ నాటికి అందనున్నట్లు అంచనా.
ఇటీవల నిర్వహించిన ఆపరేషన్ సింధూర్‌లో ఈ క్షిపణి వ్యవస్థ కీలక పాత్ర పోషించింది. అలాగే గత నెలలో మరో ఐదు ఎస్-400 యూనిట్ల కొనుగోలుకు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో మొత్తం యూనిట్ల సంఖ్య 10కు పెరగనుంది. అమెరికా నుంచి సీఏఏటీఎస్‌ఏ చట్టం కింద ఆంక్షల హెచ్చరికలు ఉన్నప్పటికీ, భారత్ ఈ ఒప్పందాన్ని కొనసాగించింది. అయితే తాజా కొనుగోలు గత ఆర్డర్‌కు అనుబంధంగా ఉండటంతో ఆంక్షల ప్రభావం ఉండకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన సిబ్బందికి ఇప్పటికే రష్యా శిక్షణ అందించింది. దీర్ఘ శ్రేణి వైమానిక రక్షణలో ఎస్-400 ప్రపంచంలో అత్యాధునిక వ్యవస్థగా గుర్తింపు పొందింది.
భారత వైమానిక రక్షణకు శక్తివంతమైన కవచం..ఎస్–400
భారత రక్షణ వ్యవస్థలో కీలక భాగంగా మారిన ఎస్-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థ దేశ వైమానిక భద్రతను మరింత బలోపేతం చేస్తోంది. రష్యా అభివృద్ధి చేసిన ఈ అత్యాధునిక దీర్ఘశ్రేణి ఉపరితల-నుంచి-గాలికి (సర్ఫేస్–టు–ఎయిర్) క్షిపణి వ్యవస్థ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది.
ప్రధాన లక్షణాలు
• 400 కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాలను గుర్తించి కూల్చివేయగలదు
• ఒకేసారి పలు లక్ష్యాలను ట్రాక్ చేసి దాడి చేయగలదు
• ఫైటర్ జెట్లు, డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ మిసైళ్లను కూడా ధ్వంసం చేయగలదు
• అత్యాధునిక రాడార్ వ్యవస్థతో శత్రు కదలికలను ముందుగానే గుర్తిస్తుంది
భారత రక్షణలో ప్రాముఖ్యత
ఎస్-400 వ్యవస్థతో భారత వైమానిక రక్షణ సామర్థ్యం గణనీయంగా పెరిగింది. ఇది సరిహద్దు ప్రాంతాల్లో శత్రు వైమానిక దాడులను సమర్థవంతంగా అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా చైనా, పాకిస్తాన్ వంటి దేశాల నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కొనేందుకు ఇది బలమైన కవచంగా నిలుస్తోంది.
