Let's talk: editor@tmv.in
దేశీయ భాషల పునాదిపైనే భారత్ నిర్మాణం: రాష్ట్రపతి

దేశీయ భాషల పునాదిపైనే భారత్ నిర్మాణం: రాష్ట్రపతి

Pinjari Chand
17 ఏప్రిల్, 2026

బలమైన, స్వావలంబనతో కూడిన అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణం దేశీయ భాషల పునాదిపైనే సాధ్యమని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మహారాష్ట్రలోని మహత్మా గాంధీ ఇంటర్‌‌నేషనల్‌ హిందీ యూనివర్సిటీ ఆరో కాన్వకేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలోని వివిధ భాషల్లో సంస్కృతి, భావోద్వేగం, చైతన్యం ఒకే ప్రవాహంలా ప్రవహిస్తాయని ఆమె పేర్కొన్నారు. ప్రతి భారతీయుడు తన మాతృభాషతో పాటు మరో భారతీయ భాషను కూడా నేర్చుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. 1936లో వర్ధాలోనే మహత్మగాంధీ, సుబాశ్‌ చంద్రబోస్, కాలేల్‌కర్‌ కలిసి ‘రాష్ట్రభాషా ప్రచార్ సమితి’ను స్థాపించి హిందీ భాషను ప్రోత్సహించారని ముర్ము గుర్తుచేశారు. గాంధీజీ మాతృభాష గుజరాతీ కాగా, నేతాజీది బెంగాలీ, కాకా కాలేల్‌కర్‌ది మరాఠీ అయినప్పటికీ, దేశ ఐక్యత కోసం హిందీ భాషను వారు ఉపయోగించారని చెప్పారు.

స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో హిందీ భాష దేశవ్యాప్తంగా ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిందని ఆమె పేర్కొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన “రక్తం ఇవ్వండి, స్వాతంత్ర్యం అందిస్తాను” అనే పిలుపు కూడా హిందీలోనే ఇచ్చారని తెలిపారు. భారతీయ భాషల్లోనే దేశ ఆత్మ వ్యక్తమవుతుందని ముర్ము అన్నారు. ఉదాహరణకు ఒడియా మాట్లాడే వారు హిందీలోని మున్షీ ప్రేమ్‌చంద్‌ కథలు,మహదేవి వర్మ కవితలను అనువాదాల ద్వారా సులభంగా అనుభూతి చెందగలరని చెప్పారు. అదే విధంగా హిందీ పాఠకులు ఒడియా రచయితలైన ఫకీర్‌‌ మోహన్ సేనాపతి, గోపినాథ్‌ మోహంతి, ప్రతిభా రే రచనలను చదివి అనుభూతి చెందగలరని వివరించారు.

జాతీయ లక్ష్యాలపై దృష్టి పెట్టాలి

బెంగాలీ, సంస్కృత భాషల మిశ్రమంతో రచించిన దేశగీతం ‘వందే మాతరం’ భారతీయుల భావోద్వేగాలను ఒకే తాటిపై కట్టిపడేస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు భారతదేశ వారసత్వం, భాషల పట్ల గౌరవం కలిగి ఉండాలని ఆమె సూచించారు. దేశంలో ఉన్న బానిస మనస్తత్వ అవశేషాలను తొలగించడం, భారత జ్ఞాన సంప్రదాయాలకు మళ్లీ గౌరవం తీసుకురావడం అనే రెండు జాతీయ లక్ష్యాలపై దృష్టి పెట్టాలని అన్నారు. తనకు ఇష్టమైన ఒడియా కవితలోని ఒక పంక్తిని ఉటంకిస్తూ ‘ఎన్ని భాషలైనా నేర్చుకోండి, కానీ మాతృభాషను గౌరవించండి’ అని తెలిపారు. భారతీయ భాషల ద్వారానే సృజనాత్మకత, పరిశోధన, స్వతంత్ర ఆలోచన, ఆవిష్కరణలు సాధ్యమవుతాయని ఆమె పేర్కొన్నారు. దేశం బలమైన, స్వావలంబనతో కూడిన అభివృద్ధి చెందిన భారత్‌గా మారాలంటే భారతీయ భాషల ప్రోత్సాహంపై దృష్టి పెట్టాలని ఆమె అన్నారు. ఇందులో భాగంగా ఎన్‌ఈపీ వంటి కార్యక్రమాల ద్వారా దేశం సరైన దిశలో ముందుకు సాగుతోందని రాష్ట్రపతి ముర్ము అభిప్రాయపడ్డారు.