

‘భారత్ గొప్ప దేశం’.. వివాదాస్పద పోస్టుపై ట్రంప్ యూటర్న్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో చేసిన ఒక రీపోస్ట్ అంతర్జాతీయ స్థాయిలో పెద్ద దుమారాన్నే రేపింది. భారత్, చైనా వంటి దేశాలను కించపరిచేలా ఉన్న వ్యాఖ్యలను ఆయన సమర్థించడంతో ఒక్కసారిగా కలకలం మొదలైంది. అయితే దీనివల్ల జరిగే రాజకీయ నష్టాన్ని గుర్తించిన ట్రంప్ బృందం.. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. "భారత్ చాలా గొప్ప దేశమని, ప్రధాని మోడీ నాకు మంచి మిత్రుడు" అని ట్రంప్ గతంలో అన్న మాటలను గుర్తు చేస్తూ, భారత్ పట్ల తమకు ఉన్న గౌరవాన్ని చాటుకుంటూ నష్టనివారణ చర్యలు చేపట్టింది.
వివాదానికి కారణం ఏంటి?
అమెరికాలో ‘పుట్టుకతో వచ్చే పౌరసత్వం’ చట్టాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శిస్తూ మైఖేల్ సావజ్ అనే రేడియో హోస్ట్ చేసిన వీడియోను ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో రీపోస్ట్ చేశారు. ఆ వీడియోలో సావజ్ మాట్లాడుతూ.. భారత్, చైనా వంటి ‘నరకకూపాల’ నుండి జనం అమెరికాకు వచ్చి ఇక్కడ పౌరసత్వం పొందుతున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక దేశాధ్యక్షుడు ఇలాంటి వివక్షాపూరిత వ్యాఖ్యలను షేర్ చేయడంపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి.
వెంటనే స్పందించిన అమెరికా ఎంబసీ
వివాదం ముదరడంతో అమెరికా ఎంబసీ ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు. "భారత్ ఒక గొప్ప దేశం అని, అక్కడ తనకి అత్యంత సన్నిహిత మిత్రుడు (ప్రధాని మోడీ) అధికారంలో ఉన్నారని ప్రెసిడెంట్ ట్రంప్ నమ్ముతారు" అని వివరణ ఇచ్చారు. సావజ్ చేసిన వ్యాఖ్యలతో ట్రంప్‌నకు సంబంధం లేదని, భారత్ పట్ల ఆయనకు ఉన్న గౌరవం ఎప్పటికీ తగ్గదని చెప్పే ప్రయత్నం చేశారు.
భారత్ ఏమందంటే?
ఈ అంశంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్‌ను ప్రశ్నించగా.. ఆయన చాలా సంయమనంతో సమాధానమిచ్చారు. "మేము ఈ వార్తలను గమనించాం. ఆ విషయాన్ని అంతటితో వదిలేస్తున్నాం" అని పేర్కొన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలకు అనవసర ప్రాముఖ్యత ఇవ్వకూడదనే ఉద్దేశంతో భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.
