Let's talk: editor@tmv.in
థామస్ కప్ క్వార్టర్స్‌లోకి భారత్

థామస్ కప్ క్వార్టర్స్‌లోకి భారత్

Shaik Mohammad Shaffee
28 ఏప్రిల్, 2026

ప్రతిష్టాత్మక థామస్ కప్ ఫైనల్స్ టోర్నమెంట్‌లో భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు అజేయంగా దూసుకుపోతోంది. సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన గ్రూప్-ఏ పోరులో భారత్ 5-0 తేడాతో ఘనవిజయం సాధించి, క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. తొలి మ్యాచ్‌లో కెనడాపై 4-1 తేడాతో నెగ్గిన టీమిండియా, ఇప్పుడు ఆస్ట్రేలియాను మట్టికరిపించి గ్రూప్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. భారత్‌తో పాటు ఇదే గ్రూపులో ఉన్న చైనా కూడా తదుపరి దశకు చేరుకుంది. బుధవారం భారత్, చైనా మధ్య జరిగే పోరు గ్రూప్ టాపర్‌ను నిర్ణయించనుంది.

అదరగొట్టిన లక్ష్యసేన్, ఆయుష్ శెట్టి

సింగిల్స్ విభాగంలో భారత్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. తొలి మ్యాచ్‌లో కామన్వెల్త్ గేమ్స్ విజేత లక్ష్యసేన్ 21-14, 21-16 తేడాతో ఆస్ట్రేలియాకు చెందిన ఎఫ్రైమ్ స్టీఫెన్ సామ్‌పై అలవోకగా విజయం సాధించి భారత్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించారు. అనంతరం జరిగిన రెండో సింగిల్స్‌లో యువ కెరటం ఆయుష్ శెట్టి ప్రత్యర్థి శ్రే ధండ్‌ను చిత్తు చేశాడు. ఇటీవల ఆసియా ఛాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచిన ఆయుష్, కేవలం 21-8, 21-6 తో ఏకపక్ష విజయాన్ని నమోదు చేసి జట్టు ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు.

విజయాన్ని ఖాయం చేసిన సాత్విక్-చిరాగ్ ద్వయం

ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేతలు సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి జంట తమ ఫామ్‌ను కొనసాగిస్తూ భారత్‌కు తిరుగులేని విజయాన్ని అందించారు. మొదటి డబుల్స్ మ్యాచ్‌లో రిజ్కీ హిదాయత్ - జాక్ యూ జోడీని 21-14, 21-16 స్కోరుతో ఓడించి 3-0 ఆధిక్యంతో సిరీస్‌ను కైవసం చేసుకున్నారు. దీంతో భారత క్వార్టర్ ఫైనల్ ప్రవేశం అధికారికంగా ఖరారైంది.

ముగింపులోనూ అదే జోరు

తర్వాతి మ్యాచ్‌ల్లోనూ భారత్ పట్టు సడలించలేదు. సీనియర్ ప్లేయర్ హెచ్.ఎస్. ప్రణయ్ 21-11, 21-17 తేడాతో రిషి హోండా భూపతిపై కేవలం అరగంట లోపే విజయం సాధించి స్కోరును 4-0 కు చేర్చారు. ఇక ఆఖరిదైన రెండో డబుల్స్ మ్యాచ్‌లో హరిహరన్ అమ్సాకరుణన్ - ఎం.ఆర్. అర్జున్ జోడీ 21-12, 21-10 తో ఆండికా రామడైన్షా - ఎఫ్రైమ్ స్టీఫెన్ సామ్ ద్వయాన్ని ఓడించింది. దీంతో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా భారత్ 5-0 తో ఆస్ట్రేలియాను క్లీన్‌స్వీప్ చేసి అదరగొట్టింది.

థామస్ కప్ క్వార్టర్స్‌లోకి భారత్ - Tholi Paluku