Let's talk: editor@tmv.in
జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌‌లో భారత్‌కు పతకాల పంట

జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌‌లో భారత్‌కు పతకాల పంట

Shaik Mohammad Shaffee
23 ఏప్రిల్, 2026

ఈజిప్టు వేదికగా జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ షూటింగ్ ప్రపంచ కప్‌లో భారత యువ షూటర్లు సత్తా చాటుతున్నారు. రెండో రోజైన బుధవారం భారత క్రీడాకారులు ఒక రజతం, రెండు కాంస్యాలతో సహా మొత్తం నాలుగు పతకాలను సాధించి పట్టికలో భారత్ స్థానాన్ని మరింత మెరుగుపరిచారు. ముఖ్యంగా మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో సెజల్ కాంబ్లే రజత పతకంతో మెరవగా, పురుషుల విభాగంలోనూ భారత షూటర్లు పోటాపోటీగా ఆడి పతకాలు కైవసం చేసుకున్నారు.

మహిళల 25 మీటర్ల పిస్టల్ ఫైనల్‌లో భారత షూటర్ సెజల్ కాంబ్లే అద్భుత ప్రదర్శన కనబరిచింది. హోరాహోరీగా సాగిన ఈ తుది పోరులో సెజల్ 27 పాయింట్లు సాధించి రజత పతకాన్ని తన సొంతం చేసుకుంది. ఇదే విభాగంలో తటస్థ అథ్లెట్‌గా బరిలోకి దిగిన కాట్సియారినా ఇవనోవా 31 పాయింట్లతో స్వర్ణాన్ని గెలుచుకోగా, సోఫియా స్మెటాంకినా కాంస్యం దక్కించుకుంది. అంతకుముందు జరిగిన క్వాలిఫైయింగ్ రౌండ్‌లోనూ సెజల్ 580 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదే ఫైనల్లో భారత్ తరఫున బరిలోకి దిగిన అంజలి భగవత్ 6వ స్థానంలో, పారిషా గుప్తా 7వ స్థానంలో నిలిచారు.

పురుషుల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో భారత్‌కు రెండు పతకాలు దక్కాయి. రాజచంద్ర 580 పాయింట్లతో రజత పతకాన్ని కైవసం చేసుకోగా, అభినవ్ దేశ్వాల్ 578 పాయింట్లతో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. కిరిల్ సుకనోవ్ స్వర్ణాన్ని సాధించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. టాప్-6 షూటర్లలో స్వర్ణ విజేత మినహా మిగిలిన ఐదుగురు భారతీయులే కావడం విశేషం. యుగ్‌ ప్రతాప్ సింగ్, సాహిల్ చౌదరి, అభినవ్ చౌదరి వరుసగా నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో నిలిచి భారత షూటింగ్ పటిష్టతను చాటారు.

పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో భారత షూటర్ రోహిత్ కన్యన్ కేవలం 0.5 పాయింట్ల స్వల్ప తేడాతో స్వర్ణాన్ని కోల్పోయి రజతంతో సరిపెట్టుకున్నాడు. రోహిత్ 615.8 పాయింట్లు సాధించగా, కజకిస్థాన్‌కు చెందిన ఒలేగ్ నోస్కోవ్ 616.3 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇదే ఈవెంట్‌లో మరో భారత షూటర్ శివేంద్ర బహుదూర్ సింగ్ (613.6) తృటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకుని నాలుగో స్థానానికి పరిమితమయ్యాడు.

మరోవైపు షాట్‌గన్ పోటీల్లో భారత షూటర్లకు అదృష్టం కలిసిరాలేదు. మహిళల స్కీట్ విభాగంలో రిషమ్ గురోన్ క్వాలిఫైయింగ్ రౌండ్‌లో రెండో స్థానంలో నిలిచి ఆశలు రేకెత్తించినప్పటికీ, ఫైనల్లో ఏడో స్థానంతో నిరాశపరిచింది. పురుషుల స్కీట్ విభాగంలో ఇషాన్ సింగ్ లిబ్రా నాలుగో స్థానంలో నిలిచి పతకానికి అడుగు దూరంలో నిలిచిపోయాడు.

ఏడుకు చేరిన భారత పతకాల సంఖ్య

ప్రస్తుత టోర్నీలో భారత్ పతకాల సంఖ్య ఏడుకు (1 స్వర్ణం, 4 రజతాలు, 2 కాంస్యాలు) చేరింది. తొలిరోజైన మంగళవారం పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో శివ నర్వాల్ స్వర్ణం, చిరాగ్ శర్మ రజతం సాధించగా, మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో పనాహా భుగ్రా రజతం గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో మొత్తం 25 దేశాల నుంచి 284 మంది షూటర్లు పాల్గొంటుండగా.. భారత్ నుంచి అత్యధికంగా 71 మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతేడాది జరిగిన జూనియర్ వరల్డ్ కప్‌లో భారత్ రికార్డు స్థాయిలో 37 పతకాలు సాధించింది. అదే ఉత్సాహంతో ఈసారి కూడా మరిన్ని పతకాలు సాధించాలని క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు.