Let's talk: editor@tmv.in
ఇండియా కూటమి అవినీతి, వారసత్వ రాజకీయ కూటమి: బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్

ఇండియా కూటమి అవినీతి, వారసత్వ రాజకీయ కూటమి: బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్

Gaddamidi Naveen
9 జూన్, 2026

న్యూఢిల్లీలో నిన్న జరిగిన‌ ‘ఇండియా’ కూటమి సమావేశానికి ముందు ఆ కూటమిపై తెలంగాణ బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇండియా కూటమి అనేది ఎటువంటి నిర్దిష్ట సిద్ధాంతాలు, విధానాలు లేని ఒక "అవినీతి, వారసత్వ రాజకీయ కూటమి" అని ఆయన అభివర్ణించారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుంటూ.. ఈ కూటమికి కేవలం బీజేపీ వ్యతిరేకత, భారత వ్యతిరేక రాజకీయం చేయడం మినహా మరో ఎజెండా లేదని మండిపడ్డారు.

ఈ సంద‌ర్భంగా బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) లో తిరుగుబాటు పరిణామాలను ప్రస్తావించారు. మమతా బెనర్జీ వారసత్వ, నిరంకుశ పాలనలో ఊపిరాడక, తమ బాధలను చెప్పుకోలేక ఉక్కిరిబిక్కిరి అయిన 61 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు విడిపోయి, అసలైన టీఎంసీగా ప్రత్యేక గ్రూపుగా ఏర్పడాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. టీఎంసీ తరహాలోనే ఇండియా కూటమి కూడా త్వరలోనే ముక్కలు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రాంతీయ పార్టీలను సర్వనాశనం చేసి, కాంగ్రెస్‌ను బలోపేతం చేయడమే రాహుల్ గాంధీ అంతిమ లక్ష్యమనే నిజాన్ని కూటమిలోని మిగిలిన పార్టీలు త్వరలోనే గ్రహిస్తాయని ఆయన పేర్కొన్నారు.

ఇండియా కూటమిలో పెరుగుతున్న విబేధాలు

ప్రస్తుతం ఇండియా కూటమిలో అంతర్గత విబేధాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీతో కాంగ్రెస్ జతకట్టడంతో, డీఎంకే తీవ్ర అసంతృప్తితో నిన్న‌టి సమావేశాన్ని బహిష్కరించింది. కాంగ్రెస్ ఒక నమ్మకద్రోహ పార్టీ అని, భవిష్యత్తులో మరికొన్ని పార్టీలు కూడా ఈ కూటమిని వీడనున్నాయని డీఎంకే నేత టీకేఎస్ ఇలంగోవన్ వ్యాఖ్యానించారు.

ఇండియా కూటమి అవినీతి, వారసత్వ రాజకీయ కూటమి: బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ - Tholi Paluku