Let's talk: editor@tmv.in
‘ఇండియా’ కూటమి దక్షిణ రాష్ట్రాలకు చారిత్రాత్మక ద్రోహం చేసింది: కేంద్ర మంత్రి బండి సంజయ్

‘ఇండియా’ కూటమి దక్షిణ రాష్ట్రాలకు చారిత్రాత్మక ద్రోహం చేసింది: కేంద్ర మంత్రి బండి సంజయ్

Gaddamidi Naveen
19 ఏప్రిల్, 2026

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ నియోజకవర్గాల పునర్విభజన ( డీలిమిటేషన్) సవరణ బిల్లు వీగిపోవడంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ 'ఇండియా' కూటమి దక్షిణాది రాష్ట్రాలకు చారిత్రక ద్రోహం చేశాయని ఆయన ఆరోపించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఎక్స్ వేదిక ద్వారా 2026 తర్వాత జరగబోయే జనాభా గణన అనంతరం, ఆర్టికల్ 81 ప్రకారం సీట్ల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే ప్రమాదం ఉందని, దానిని అడ్డుకోవడానికే కేంద్రం రాజ్యాంగ (131వ సవరణ) బిల్లును తెచ్చిందని బండి సంజయ్ వివరించారు. జనాభాను నియంత్రించి, అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం దెబ్బతినకుండా ఈ బిల్లు రక్షణ కల్పించేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఈ బిల్లును అడ్డుకోవడం ద్వారా ఆ రక్షణ కవచాన్ని తొలగించిందని మండిపడ్డారు.

బయట "సౌత్ ప్రైడ్" (దక్షిణాది గర్వం) అని అరిచే కాంగ్రెస్ నేతలు, పార్లమెంటు లోపల మాత్రం దక్షిణాది గొంతు నొక్కేలా వ్యవహరించారని విమర్శించారు. లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచుతామని, తద్వారా దక్షిణాది సీట్లు కూడా పెరుగుతాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా హామీ ఇచ్చినా, ప్రతిపక్షాలు మౌనంగా ఉండి బిల్లును ఓడించాయని గుర్తు చేశారు.

మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు దక్కకుండా చేయడమే కాకుండా, రాబోయే తరాలకు న్యాయమైన ప్రాతినిధ్యం లేకుండా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ప్రతి ప్రాంతాన్ని రక్షించాలని చూస్తుంటే, ప్రతిపక్షాలు కేవలం అధికారం కోసమే పాకులాడుతున్నాయని ఆయన దుయ్యబట్టారు. లోక్‌సభలో శుక్రవారం జరిగిన ఓటింగ్‌లో అవసరమైన మెజారిటీ లభించకపోవడంతో ఈ బిల్లు వీగిపోయిన విషయం తెలిసిందే. దీనివల్ల 2029లో మహిళా రిజర్వేషన్ల అమలుపై సందిగ్ధత నెలకొందని ఆయన పేర్కొన్నారు.