Let's talk: editor@tmv.in
ఇండియా–ఆఫ్రికా భాగస్వామ్యం స్థిరత్వానికి సందేశం: జైశంకర్

ఇండియా–ఆఫ్రికా భాగస్వామ్యం స్థిరత్వానికి సందేశం: జైశంకర్

Pinjari Chand
24 ఏప్రిల్, 2026

ప్రపంచం ప్రస్తుతం సంక్లిష్ట భౌగోళిక-రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇండియా–ఆఫ్రికా భాగస్వామ్యం మరింత ప్రాముఖ్యత సంతరించుకుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఈ భాగస్వామ్యం అస్థిర ప్రపంచంలో స్థిరత్వం, అనిశ్చితిలో నమ్మకానికి సందేశంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇండియా–ఆఫ్రికా ఫోరం సమ్మిట్-4 లోగో, థీమ్, వెబ్‌సైట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమ్మిట్ మే 28 నుంచి 31 వరకు జరగనుంది.

మంచి ప్రపంచ నిర్మాణంలో భాగస్వాములు

ఇండియా, ఆఫ్రికా దేశాలు కేవలం అభివృద్ధి భాగస్వాములే కాకుండా, మంచి ప్రపంచ నిర్మాణంలో భాగస్వాములని జై శంకర్ స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ భాగస్వామ్యం మరింత బలపడాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఎండ్యూరింగ్‌ పార్ట్నర్‌‌షిప్‌, షేర్‌‌డ్‌ విజన్’ అనే థీమ్‌తో జరిగే ఈ సమ్మిట్ రెండు ప్రాంతాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేక వేదికగా నిలుస్తుందని తెలిపారు. భారత విదేశాంగ విధానంలో ఆఫ్రికాకు కీలక స్థానం ఉందని జైశంకర్ చెప్పారు. ఇటీవల సంవత్సరాల్లో ఆఫ్రికాలో భారత్ 17 కొత్త మిషన్లను ప్రారంభించి మొత్తం వాటి సంఖ్యను 46కు పెంచిందన్నారు.

చారిత్రక బంధం

భారత్–ఆఫ్రికా సంబంధాలు శతాబ్దాల చరిత్ర కలిగినవని, సాంస్కృతిక మార్పిడి, మానవ సంబంధాల ద్వారా అవి మరింత బలపడ్డాయని తెలిపారు. బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో భారత్ ఆఫ్రికా దేశాలకు మద్దతు ఇచ్చిందని గుర్తుచేశారు.

అభివృద్ధి లక్ష్యాల్లో సమన్వయం

భారత్ ‘వికసిత్‌ భారత్ 2047’ లక్ష్యం, ఆఫ్రికా ‘అజెండా 2063’ లక్ష్యాలు పరస్పర అనుసంధానమైనవని, స్థిరమైన అభివృద్ధి, సమగ్ర వృద్ధి దిశగా రెండు ప్రాంతాలు కలిసి ముందుకు సాగుతున్నాయని అన్నారు. ఆఫ్రికాకు అంతర్జాతీయ వేదికల్లో సముచిత స్థానం కల్పించేందుకు భారత్ ఎప్పటికప్పుడు మద్దతు ఇస్తోందని చెప్పారు. 2023లో ఆఫ్రికన్ యూనియన్‌ను జీ20లో చేర్చడం ఈ దిశలో కీలక అడుగని పేర్కొన్నారు. రక్షణ, భద్రత, సముద్ర సహకారం కూడా ఈ భాగస్వామ్యంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. భారత మహాసముద్ర ప్రాంతంలో స్థిరత్వం, సముద్ర మార్గాల భద్రత కోసం సహకారం కొనసాగుతోందన్నారు.