
పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యల కేసు:స్టాండ్‌అప్ కామెడియన్ అనుదీప్‌కు బెయిల్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు ఆయన కుటుంబ సభ్యులపై సామాజిక మాధ్యమాలు, బహిరంగ వేదికలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టాండ్‌అప్ కామెడియన్ అనుదీప్ కటికాలాకు కాకినాడ స్థానిక కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది.
కేసు నేపథ్యం
పోలీసుల కథనం ప్రకారం హైదరాబాద్‌కు చెందిన అనుదీప్ కటికాలా (30) ఈ నెల 8వ తేదీన బెంగళూరులో నిర్వహించిన ఒక స్టాండ్‌అప్ కామెడీ షోలో పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో భాగంగా పవన్ కళ్యాణ్‌తో పాటు ఆయన అన్న కూతురు నిహారిక కొణిదెలపై వ్యక్తిగత దూషణలకు దిగుతూ వారి గౌరవానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులు అందాయి. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేగింది. దీనిపై స్పందించిన కాకినాడ వన్‌టౌన్ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు.
అనుదీప్ వ్యాఖ్యలు వ్యక్తుల ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు అతనిపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 356(2), 353(2), 79తో పాటు ఐటీ చట్టం సెక్షన్ 67 కింద కేసులు నమోదు చేశారు. కేసు నమోదైన వెంటనే విచారణ చేపట్టిన పోలీసులకు నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిసింది. సాంకేతిక ఆధారాలతో అతను ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో తన తండ్రి వద్ద ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లి ఈ నెల 14న అతనికి నోటీసులు అందజేశారు.
కోర్టులో హాజరు - బాండ్‌పై విడుదల
పోలీసుల నోటీసుల నేపథ్యంలో అనుదీప్ గురువారం (ఏప్రిల్ 16) కాకినాడకు చేరుకుని పోలీసుల ఎదుట లొంగిపోయాడు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ అనంతరం కోర్టులో హాజరు పరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం నిందితుడికి రూ.10,000 వ్యక్తిగత పూచీకత్తు (ష్యూరిటీ బాండ్)పై బెయిల్ మంజూరు చేసింది.
