Let's talk: editor@tmv.in
ఓటరు జాబితా ప్రక్షాళన వల్లే పెరిగిన పోలింగ్: ఎన్. రామచందర్ రావు

ఓటరు జాబితా ప్రక్షాళన వల్లే పెరిగిన పోలింగ్: ఎన్. రామచందర్ రావు

Gaddamidi Naveen
25 ఏప్రిల్, 2026

తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన రికార్డు స్థాయి పోలింగ్ శాతంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఓటర్లలో కనిపిస్తున్న ఈ ఉత్సాహం మార్పుకు సంకేతమని, ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రక్షాళన వల్ల పారదర్శకత పెరిగిందని ఆయన పేర్కొన్నారు.

శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమిళనాడు, బెంగాల్‌లో భారీ పోలింగ్ నమోదు కావడం ప్రజల్లో మార్పు పట్ల ఉన్న ఆకాంక్షను ప్రతిబింబిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (స‌ర్) ద్వారా నకిలీ ఓట్లను తొలగించడం వల్ల ఇప్పుడు అసలైన ఓటర్ల జాబితా సిద్ధమైంది. ఈ ప్రక్షాళన వల్లే ఓటింగ్ శాతం పెరగడం ప్రజాస్వామ్యానికి మంచి సంకేతం అని ఆయన విశ్లేషించారు.

ముఖ్య ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ రెండు రాష్ట్రాల్లో ఇదే అత్యధిక పోలింగ్ కావడం విశేషం. ఎన్నికల కమిషన్ తరఫున ప్రతి ఓటరికి ఆయన అభినందనలు తెలిపారు.

పశ్చిమ బెంగాల్

ఎన్నికల కమిషన్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లో మొదటి దశలో ఏకంగా 91.91 శాతం పోలింగ్ నమోదైంది. ముఖ్యంగా దక్షిణ దినాజ్‌పూర్ (94.85%), కూచ్ బెహర్ (94.54%) జిల్లాల్లో ఓటర్లు భారీగా తరలివచ్చారు. జిల్లాల్లో 90 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది.

తమిళనాడు

ఈ రాష్ట్రంలో 84.80 శాతం ఓటింగ్ నమోదైంది. కరూర్ జిల్లా 92.48 శాతంతో అగ్రస్థానంలో నిలవగా, సేలం (90.42%), ధర్మపురి (90.02%), ఈరోడ్ (89.97%) జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

తమిళనాడులోని మొత్తం 234 నియోజకవర్గాలకు, పశ్చిమ బెంగాల్‌లోని 152 నియోజకవర్గాలకు గురువారం సాయంత్రం 6 గంటలతో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని మిగిలిన 142 నియోజకవర్గాలకు మే 29న పోలింగ్ జరగనుంది. అన్ని రాష్ట్రాల ఫలితాలు మే 4వ తేదీన వెలువడనున్నాయి. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రక్షాళన చర్యలు ఓటింగ్ శాతాన్ని పెంచడమే కాకుండా, ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరింత బలపరిచాయని రామచందర్ రావు పేర్కొన్నారు.

గ‌తంలో పోలింగ్ శాతం ఇలా..

తమిళనాడులో గత అసెంబ్లీ 2021 ఎన్నికల్లో సుమారు 72.8 శాతం పోలింగ్ నమోదు కాగా, 2016లో అది సుమారు 74.3 శాతంగా ఉంది. ఈసారి నమోదైన శాతం గత ఎన్నికలతో పోలిస్తే దాదాపు 10 శాతం మేర పెరిగింది.

ఇక పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే, గతంలో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం పోలింగ్ శాతం సుమారు 81.7 శాతం కాగా, 2016లో అది సుమారు 82.2 శాతంగా నమోదైంది. ప్రస్తుత గణాంకాలతో పోలిస్తే ఈసారి గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది.