
పెరిగిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలి:సీఎం రేవంత్ రెడ్డి
కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ అనాలోచిత ధరల పెంపు సామాన్య ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం మోపడంతో పాటు దేశంలోని అనేక కీలక రంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందించిన ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం అత్యంత అన్యాయమైనదని ఆయన అభివర్ణించారు.
ఎన్నికల హామీలు.. కేవలం ఓట్ల కోసమేనా?
కాగా అంతర్జాతీయంగా అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలను సాకుగా చూపుతూ దేశీయంగా ఇంధన ధరలను పెంచడం సరికాదని రేవంత్ రెడ్డి విమర్శించారు. అంతర్జాతీయ పరిణామాల పేరు చెప్పి సామాన్య ప్రజల నడ్డి విరిచేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ఇటీవల నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన ఎన్నికల సమయంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలను పెంచబోమంటూ కేంద్ర ప్రభుత్వం పదేపదే ఇచ్చిన హామీలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడి పది రోజులు కూడా గడవకముందే లీటరుకు రూ.3 కంటే ఎక్కువగా ధరలను పెంచడం ప్రజల విశ్వాసానికి చేసిన ముమ్మాటికీ ద్రోహమేనని ఆయన ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వానికి కేవలం ఓట్లు, ఎన్నికల విజయాల పైనే శ్రద్ధ ఉంది తప్ప, ప్రజల సంక్షేమం పట్టడం లేదని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. ప్రజల విశ్వాసాన్ని మోసం చేసేలా వ్యవహరిస్తున్న కేంద్రం తక్షణమే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థ పాలన, తప్పుదారి పట్టించే విధానాల వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా బలహీనపడిందని విమర్శించారు. కేంద్రం గొప్పగా చెప్పుకునే ‘ఆత్మనిర్భర్ భారత్’ నినాదం కేవలం ఓట్లు సాధించుకోవడానికే పరిమితమైందని క్షేత్రస్థాయిలో అది ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయిందని దీనివల్ల దేశంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని యువతకు ఉపాధి భరోసా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న హామీ సైతం కాగితాలకే పరిమితమైందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. గత పదేళ్లుగా రూపాయి విలువ క్రమంగా పడిపోతూ ప్రస్తుతం అత్యల్ప స్థాయికి చేరుకుందని గుర్తుచేశారు. ఒకవైపు భారతదేశాన్ని ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దామని గొప్పలు చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం.. సామాన్యులపై ఇలాంటి పెట్రోల్ భారాన్ని మోపడాన్ని ఏ విధంగా సమర్థించుకుంటుందో దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలదీశారు.
