

నియోజకవర్గాల పెంపుతో బడుగు వర్గాలకు అన్యాయం: సీఎం రేవంత్ రెడ్డి
భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ.. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తీవ్రంగా వ్యతిరేకించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 'దామాషా పద్ధతి' ప్రకారం నియోజకవర్గాల పెంపు జరిగితే, అది కేవలం రాష్ట్రాల మధ్య అంతరాన్ని పెంచడమే కాకుండా.. సామాజికంగా వెనుకబడిన వర్గాలకు తీరని నష్టం కలిగిస్తుందని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానం అమలులోకి వస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మహిళలకు కేటాయించే రిజర్వు సీట్లు తగ్గిపోతాయని ఆయన పేర్కొన్నారు. మహిళలకు సమాన హక్కులు, ఓటు హక్కు కల్పించి సమాజంలో గౌరవ స్థానం తీసుకువచ్చిన నాయకుడు అంబేద్కర్ అని ముఖ్యమంత్రి కొనియాడారు. మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పెంపుతో ముడిపెట్టి కలగాపులగం చేయడం సరికాదని, మహిళా రిజర్వేషన్ల పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. మొదట జనాభా ప్రాతిపదికను ప్రస్తావించి, అభ్యంతరాలు రావడంతో ఇప్పుడు దామాషా ప్రకారం 50 శాతం పెంపు అంటున్నారని, ఇది సరైన విధానం కాదన్నారు. మిగిలిన 50 శాతం సీట్లను ఆయా రాష్ట్రాల స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) ఆధారంగా పెంచాలని కోరారు. దీనివల్ల దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతున్న రాష్ట్రాలకు తగిన గుర్తింపు లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వడాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే దానిని నియోజకవర్గాల పెంపుతో ముడిపెట్టి దక్షిణాది రాష్ట్రాలను రాజకీయంగా బలహీనపరిచే కుట్ర జరుగుతోందని విమర్శించారు. అవసరమైతే అసెంబ్లీలో కూడా మహిళా కోటాపై చట్టం చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఎస్సీ ఉపకులాల వర్గీకరణ, కులగణన వంటి కీలక నిర్ణయాలను అమలు చేసిన ఏకైక రాష్ట్రంగా నిలిచిందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. మంచి పనుల విషయంలో తెలంగాణ ఎప్పుడూ ముందుంటుందని, అంబేద్కర్ చెప్పిన “రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం” అనే భావన ఆచరణలోకి రావాలంటే రాజకీయ ప్రతినిధిత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అంబేద్కర్ ఆలోచనా విధానమే ఈ 'ప్రజా పాలన'కు పునాది అని ఆయన పేర్కొన్నారు.
సంక్షేమం, విద్యా రంగంలో మార్పులు
అంబేద్కర్ సమాజంలోని బలహీన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించే మార్గాన్ని చూపారని, విద్య ద్వారానే సమాజంలో సమానత్వం సాధ్యమని ఆయన విశ్వసించారని తెలిపారు. సమాజంలో విభజనలను తగ్గించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు కులాల మధ్య అంతరాలు తగ్గించి, దళిత, గిరిజన, మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రతి నియోజకవర్గంలో సమీకృత పాఠశాలలను నిర్మిస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం భర్తీ చేసిన 67 వేల ఉద్యోగాల్లో 87 శాతం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకే దక్కాయని ఆయన వెల్లడించారు. మంజూరు చేసిన 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లలో అధికంగా దళితులకు కేటాయింపులు చేసినట్లు చెప్పారు. అలాగే మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతంతో ప్రపంచానికి మార్గదర్శకత్వం వహించగా, అంబేద్కర్ భారతదేశానికి రాజ్యాంగ రూపకల్పన ద్వారా ఆదర్శ పరిపాలనకు దారితీశారని పేర్కొన్నారు.
తెలంగాణ ఏర్పాటు - అంబేద్కర్ విజన్
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని, తెలంగాణ ఉద్యమంలో దళితులు, గిరిజనులు, బడుగు వర్గాలు కీలక పాత్ర పోషించాయని గుర్తుచేశారు. గద్దర్, అందెశ్రీ వంటి ఉద్యమకారుల సేవలను ఈ సందర్భంగా స్మరించారు. గత ప్రభుత్వం కంటే తమ ప్రభుత్వం దళిత, గిరిజన అధికారులకు, ప్రజాప్రతినిధులకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తోందని సీఎం గుర్తు చేశారు. చివరగా, రాష్ట్ర అభివృద్ధి కోసం తాము చేస్తున్న పోరాటంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, 'ప్రజా పాలన'ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కేబినెట్‌లో తగిన ప్రాధాన్యత లభించలేదని సీఎం విమర్శించారు. దళిత నాయకుడైన గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్‌గా ఉండటం ఇష్టం లేకనే కొందరు నేతలు అసెంబ్లీకి రావడం లేదని కేసీఆర్‌ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందన
మరోవైపు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మహిళా రిజర్వేషన్ల గురించి పట్టించుకోలేదని విమర్శించారు. పునర్విభజన కోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ వేస్తామని, ప్రజాభిప్రాయాన్ని సేకరించిన తర్వాతే ముందుకెళ్తామని ఆయన పేర్కొన్నారు.
పునర్విభజన అనేది కేవలం రాజకీయ అంశం కాదని, ఇది దేశ భవిష్యత్తు, సమానత్వానికి సంబంధించినదని రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపి, ఏకాభిప్రాయం సాధించిన తర్వాతే ఈ ప్రక్రియను చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ఉత్తరాది వర్సెస్ దక్షిణాది: ప్రధానికి సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ
దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యాన్ని దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న 'నియోజకవర్గాల పునర్విభజన' అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గళమెత్తారు. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ స్థానాలను పెంచడం వల్ల అభివృద్ధి చెందిన దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని హెచ్చరిస్తూ, ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి, దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బహిరంగ లేఖ రాశారు.
కేంద్ర ప్రభుత్వం త్వరలో తీసుకురాబోయే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా లోక్‌సభ స్థానాలను 543 నుంచి 850కి పెంచాలని భావిస్తోంది. దీనిపై రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచడం వల్ల, దశాబ్దాలుగా జనాభా నియంత్రణ పాటించి, మానవాభివృద్ధిలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా శక్తిహీనమవుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రతిపాదనకు ప్రత్యామ్నాయంగా రేవంత్ రెడ్డి ఒక 'హైబ్రీడ్ మోడల్' ను ప్రతిపాదించారు. ఇందులో 50శాతం సీట్లు జనాభా ఆధారంగా, మిగతా 50 శాతం రాష్ట్రాల ఆర్థిక వృద్ధి (జీఎస్డీపీ), అభివృద్ధి పనితీరు వంటి ప్రమాణాల ఆధారంగా కేటాయించాలని సూచించారు.
ప్రధాన డిమాండ్లు
33శాతం మహిళా రిజర్వేషన్లను 2029 వరకు వేచి చూడకుండా, ప్రస్తుతం ఉన్న 543 స్థానాల్లోనే వెంటనే అమలు చేయాలి. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల సరిహద్దుల మార్పు, సీట్ల పెంపు అనేవి వేర్వేరు అంశాలని, వీటిని కలిపి అయోమయం చేయవద్దని కోరారు. సీట్లు పెంచకుండానే రాష్ట్రాల లోపల నియోజకవర్గాల సరిహద్దులను మార్చుకోవచ్చని సూచించారు. ఈ అంశంపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా, అఖిలపక్ష సమావేశం రాజకీయ పార్టీలు, నిపుణులతో సమగ్ర చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
దక్షిణాది ఐక్యతకు పిలుపు
తమిళనాడు (ఎం.కె. స్టాలిన్), ఆంధ్రప్రదేశ్ (చంద్రబాబు నాయుడు), కర్ణాటక (సిద్ధరామయ్య), కేరళ (పినరయి విజయన్) పుదుచ్చేరి ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తూ.. దక్షిణాది రాష్ట్రాల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని రేవంత్ రెడ్డి కోరారు. మేము పన్నులు చెల్లిస్తూ, ఢిల్లీలో సలాం కొట్టే పరిస్థితి రాకూడదు అని ఆయన వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 16 నుంచి 18 వరకు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ అంశంపై చర్చ జరగనున్న నేపథ్యంలో సీఎం లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది.
