Let's talk: editor@tmv.in
నేడు తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవం.. ముగ్గురు ముఖ్యమంత్రులు హాజరు

నేడు తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవం.. ముగ్గురు ముఖ్యమంత్రులు హాజరు

Gaddamidi Naveen
25 జూన్, 2026

ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల కోట్లాది మంది ప్రజల తాగు, సాగునీటి జీవనాడి అయిన తుంగభద్ర ప్రాజెక్ట్ మరో చారిత్రాత్మక ఘట్టానికి సిద్ధమైంది. ప్రాజెక్టుకు నూతనంగా అమర్చిన స్పిల్‌వే గేట్లను జూన్ 25 (గురువారం) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంయుక్తంగా ప్రారంభించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ కూడా పాల్గొంటారని అధికారిక ప్రకటన వెల్లడించింది.

మొత్తం రూ. 51 కోట్ల వ్యయంతో ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని 33 కొత్త గేట్ల ఏర్పాటు పనులను అధికారులు రికార్డు సమయంలో విజయవంతంగా పూర్తి చేశారు. ఈ నూతన గేట్ల ఏర్పాటుతో డ్యామ్ మౌలిక సదుపాయాలు మరింత బలోపేతమయ్యాయి.

ఆగస్టు 2024 ప్రమాదం

దాదాపు 73 ఏళ్ల క్రితం నిర్మించిన తుంగభద్ర డ్యామ్ ద్వారా మూడు రాష్ట్రాల్లోని లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతోంది. అయితే, ఆగస్టు 2024 లో వచ్చిన భారీ వరదల కారణంగా డ్యామ్ యొక్క 19వ నంబర్ గేటు కొట్టుకుపోయింది. ఇది ప్రాజెక్టు భద్రతపై, నీటి నిర్వహణపై తీవ్ర ఆందోళనలకు దారితీసింది. ఆ సమయంలో భారీగా నీటి వృధా కాకుండా అడ్డుకోవడానికి, సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రముఖ సీనియర్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు నేతృత్వంలోని బృందం అత్యవసర ప్రాతిపదికన తాత్కాలికంగా స్టాప్-లాక్ గేటును ఏర్పాటు చేసి ప్రమాదాన్ని నివారించింది. ఆ తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) ఇచ్చిన సిఫార్సుల మేరకు.. డ్యామ్ భద్రత దృష్ట్యా అన్ని స్పిల్‌వే గేట్లను పూర్తిగా మార్చాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, సమన్వయంతో ఈ పనులను సకాలంలో పూర్తి చేశాయి.

తుంగభద్ర ప్రాజెక్టు ద్వారా మూడు రాష్ట్రాల్లోని వందలాది గ్రామాలకు తాగునీరు, లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఏపీలోనే దాదాపు 1.46 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమికి ఈ ప్రాజెక్ట్ ద్వారా నీరు అందుతుంది. ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ ద్వారా రాయలసీమలోని కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు సాగునీరు సరఫరా అవుతుంది. నేడు నిర్వహించనున్న ఈ గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం.. ముగ్గురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రి కలిసి కర్ణాటకలోని హోస్పేట్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.

ట్యాగ్‌లు
TungabhadraProjectTungabhadraDamChandrababuNaiduRevanthReddyDKShivakumarAndhraPradeshTelanganaKarnatakaWaterManagementIrrigationProjectsDamSafety
నేడు తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవం.. ముగ్గురు ముఖ్యమంత్రులు హాజరు - Tholi Paluku