
ప్రధాని మోడీ పై అనుచిత వ్యాఖ్యలు తగవు: కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ‘దేశద్రోహి’ వ్యాఖ్యలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్రంగా ఖండించారు. వరుస ఎన్నికల పరాజయాలతో తీవ్ర నిరాశ అయోమయంలో కూరుకుపోయిన కాంగ్రెస్ నాయకత్వం ఉనికి కోసమే ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని ఆయన విమర్శించారు.
గురువారం హైదరాబాద్‌లోని ఐసీఏఆర్ - ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ ను సందర్శించిన అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్పందిస్తూ దేశ ప్రధానిపై ఆ విధమైన వ్యాఖ్యలు చేయడం వారి “చౌకబారు మనస్తత్వానికి” నిదర్శనమని మండిపడ్డారు. రాజకీయాల్లో విమర్శలు, పోటీ ఉండటం సహజమేనని అయితే వ్యక్తిగత స్థాయిలో ఇలాంటి అవమానకర భాషను ఉపయోగించడం ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు విరుద్ధమని ఆయన హితవు పలికారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రధాని మోదీ నాయకత్వానికి దక్కుతున్న గౌరవాన్ని, దేశ ప్రజలు ఆయనకు అందిస్తున్న మద్దతును కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోంది. అనేక దేశాలు మోడీకి తమ అత్యున్నత పురస్కారాలను ప్రదానం చేశాయి. అయితే ఆ గౌరవాలన్నీ 140 కోట్ల భారతీయులకే చెందుతాయని భావించే మహోన్నత నాయకుడిపై ఇలాంటి అవమానకర వ్యాఖ్యలు చేయడాన్ని దేశ ప్రజలు ఎప్పటికీ అంగీకరించరని ఆయన స్పష్టం చేశారు.
ఇదే సందర్భంలో ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ ప్రధాని నరేంద్ర మోడీకి ప్రతిష్టాత్మక ‘అగ్రికోలా మెడల్ 2026’ పురస్కారాన్ని ప్రదానం చేయడంపై శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
