Let's talk: editor@tmv.in
పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. స్టాండప్ కమెడియన్ అనుదీప్ అరెస్ట్

పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. స్టాండప్ కమెడియన్ అనుదీప్ అరెస్ట్

Shaik Mohammad Shaffee
16 ఏప్రిల్, 2026

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికాలను పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొన్ని ర్పజులుగా పరారీలో ఉన్న అనుదీప్‌ను ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కాకినాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జనసేన నేతల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడి ఆచూకీ కనిపెట్టి మరీ పట్టుకోవడం గమనార్హం.

ఫోన్ సిగ్నల్ ఆధారంగా..

హైదరాబాద్‌కు చెందిన అనుదీప్ కటికాల ఇటీవల నిర్వహించిన ఒక స్టాండప్ కామెడీ షోలో టాలీవుడ్ హీరోలు, వారి వ్యక్తిగత జీవితాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీనిపై కాకినాడకు చెందిన జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జాయింట్ సెక్రటరీ బడే వెంకటకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదైనట్లు తెలుసుకున్న అనుదీప్ యూపీలోని తన బంధువుల ఇంటికి వెళ్లిపోయాడు. నిందితుడి ఫోన్ సిగ్నల్స్‌ను ట్రాక్ చేసిన కాకినాడ వన్ టౌన్ పోలీసులు.. ప్రయాగ్‌రాజ్‌లోని ఒక పార్కులో తన తండ్రితో కలిసి ఉండగా అతడిని చుట్టుముట్టారు. అక్కడి స్థానిక స్టేషన్‌లో వివరాలు నమోదు చేసిన అనంతరం, రైలులో కాకినాడకు తరలిస్తున్నారు.

వివాదానికి కారణం ఇదే..

తన కామెడీ షోలో భాగంగా అనుదీప్.. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని, నిహారిక కొణిదెల విడాకుల అంశాన్ని ప్రస్తావిస్తూ ఎగతాళిగా మాట్లాడాడు. విడాకుల విషయంలో పవన్ కళ్యాణ్ సలహాలు తీసుకోవాలంటూ చేసిన వ్యాఖ్యలపై జనసైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించడమే కాకుండా, కక్ష పెంచేలా అసత్య ప్రచారాలు చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్‌తో పాటు రామ్ చరణ్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వంటి నటులపై కూడా అనుదీప్ సెటైర్లు వేసినట్లు సమాచారం. ముఖ్యంగా రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి చేసిన వ్యాఖ్యలపై మెగా అభిమానులు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు.

అనుదీప్ వివరణ

అయితే తన ఉద్దేశం ఎవరినీ కించపరచడం కాదని, విడాకులపై ఉన్న భయాన్ని పోగొట్టడమేనని అనుదీప్ గతంలో వివరణ ఇచ్చాడు. కష్టాల్లో ఉన్నవారు అనుభవం ఉన్నవారి సలహా తీసుకోవడం సహజమనే కోణంలోనే తాను మాట్లాడానని చెప్పుకొచ్చాడు. కాగా పోలీసులు అనుదీప్‌పై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 356(2) (పరువు నష్టం), 353(2) (విద్వేషాలు రెచ్చగొట్టడం), 79 (మహిళా గౌరవానికి భంగం కలిగించడం)తో పాటు ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద కేసులు నమోదు చేశారు. నిందితుడిని కాకినాడకు తీసుకొచ్చిన తర్వాత స్టేషన్ బెయిల్‌పై విడుదల చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి.