Let's talk: editor@tmv.in
భవిష్యత్తులో వైద్యం కోసం ప్రపంచం మొత్తం అమరావతికి వస్తుంది: సీఎం చంద్రబాబు

భవిష్యత్తులో వైద్యం కోసం ప్రపంచం మొత్తం అమరావతికి వస్తుంది: సీఎం చంద్రబాబు

Gaddamidi Naveen
4 జూన్, 2026

భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంతర్జాతీయ స్థాయి వైద్య కేంద్రంగా రూపాంతరం చెందుతుందని, ప్రపంచం నలుమూలల నుంచి రోగులు ఇక్కడికి వచ్చి చికిత్స పొందే రోజులు వస్తాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం గుంటూరులో ఏడు ఎకరాల విస్తీర్ణంలో, 600 పడకలతో నూతనంగా ఏర్పాటైన లలితా ఆసుపత్రిని ప్రారంభించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, 1995లో హైదరాబాద్‌లో హెల్త్ టూరిజాన్ని ప్రమోట్ చేసిన తరహాలోనే, రాబోయే రోజుల్లో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల రోగులు అమరావతి వచ్చి చికిత్స చేయించుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. మనిషికి ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదు. ఒక వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడే నిజమైన ధనవంతుడు అవుతాడు. ఆరోగ్యవంతులైన పౌరులే దేశాన్ని నిర్మిస్తారని సీఎం పేర్కొన్నారు. మంచి ఆరోగ్యం లేనప్పుడు వేల కోట్ల రూపాయల ఆస్తులు, రాజభవనాలు ఉన్నా ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన స్పష్టం చేశారు. దశాబ్దాలుగా వైద్య రంగంలో ఉన్న లలితా గ్రూప్, దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా అత్యాధునిక ఎమ్ఆర్ఐ స్కాన్‌ను ఇక్కడికి తీసుకురావడం సంతోషకరమని ఆయన కొనియాడారు. కార్డియాలజీ, న్యూరాలజీ, జాయింట్ రీప్లేస్‌మెంట్ వంటి 32 విభాగాల్లో సేవలందించే ఏకైక సెంటర్‌గా, ఇదొక ల్యాండ్‌మార్క్ ఇన్‌స్టిట్యూట్‌గా మారుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘సంజీవని’ డిజిటల్ హెల్త్ రికార్డ్ ప్రోగ్రామ్ గురించి సీఎం ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది ఒక సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమమని, దీని ద్వారా ప్రపంచంలోని అత్యుత్తమ వైద్య విధానాలు, విజ్ఞానాన్ని ప్రజల గడపకు తీసుకువచ్చే ప్రయత్నమే సంజీవని అని చెప్పారు. ఈ కార్యక్రమం కింద ఇంటి వద్దే 42 రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారని వెల్లడించారు. ప్రభుత్వం ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ ఆరోగ్య విధానాలను అమలు చేస్తోందని సీఎం తెలిపారు. ప్రజలు ఎలాంటి మందులు వాడాలి, ఎప్పుడు వైద్యులను సంప్రదించాలి వంటి వివరాలను కూడా సంజీవని ద్వారా అందిస్తామని చెప్పారు.

అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూనివర్సల్ హెల్త్ పాలసీ కింద ప్రతి కుటుంబానికి రూ.2.5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ప్రజలు ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. మనం తీసుకునే ఆహారం, పరిసరాలు, ఆలోచనా విధానం ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని వివరించారు.

ఆహారమే మందు – కిచెనే ఫార్మసీ

ఆసుపత్రులకు వెళ్లే అవసరం రాకుండా ప్రజలు తమ జీవనశైలిని మార్చుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. మనం తినే ఆహారం, మన చుట్టూ ఉండే వాతావరణం, మన ఆలోచనా విధానం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. ప్రభుత్వం యోగాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెబుతూ.. మనం తినే ఆహారమే మందు, మన వంటగది ఒక ఫార్మసీ అని వ్యాఖ్యానించారు. పూర్వ కాలంలో ఎరువులు లేకుండా సొంతంగా పండించుకున్న ఆహారాన్ని తినేవారని, కానీ నేడు యూరియాతో పండించిన ఆహారాన్ని తినాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లభించిన నకిలీ/నాణ్యత లేని మద్యం కారణంగా రాష్ట్రంలో చాలా మంది తీవ్రమైన ఆరోగ్య సమస్యల బారిన పడ్డారని చంద్రబాబునాయుడు ఆరోపించారు. గత ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో ఆడుకుందని ఆయన విమర్శించారు.