
విద్యా సంస్కరణల ఫలితమే ఎస్సెస్సీ ఫలితాల మెరుగుదల:ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర విద్యా సంస్కరణలు సత్ఫలితాలనిచ్చాయి. 2026 మార్చిలో జరిగిన పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు గణనీయమైన మెరుగుదల కనబరిచారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో అమలు చేసిన బహుళ స్థాయి వ్యూహాల వల్లే ఈ అద్భుత పురోగతి సాధ్యమైందని ప్రభుత్వం శుక్రవారం ఒక ప్రకటనలో అధికారికంగా వెల్లడించింది.
100 రోజుల ప్రణాళిక – అద్భుత ఫలితాలు
ఈ విజయానికి ప్రధాన కారణం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన '100 రోజుల కార్యాచరణ ప్రణాళిక'. 2025 డిసెంబర్ 6 నుండి 2026 మార్చి 15 వరకు కొనసాగిన ఈ ప్రత్యేక కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 7,000కు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో అమలైంది. దీని ద్వారా సుమారు 3.77 లక్షల మంది విద్యార్థులకు నేరుగా ప్రయోజనం చేకూరింది. నిరంతర పర్యవేక్షణ, శాస్త్రీయ బోధన పద్ధతులే ఈ ఫలితాలకు పునాదిగా నిలిచాయి.
విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం సాంకేతికతను జోడించింది. ప్రణాళికలో భాగంగా 46 స్లిప్ టెస్టులు నిర్వహించి విద్యార్థుల ప్రగతిని లీప్ మొబైల్ యాప్ ద్వారా నిరంతరం ట్రాక్ చేశారు. ఆరు రకాల డాష్‌బోర్డుల ద్వారా ఉన్నతాధికారులు రోజువారీ సమీక్షలు నిర్వహించి వెనుకబడిన విద్యార్థుల లోపాలను గుర్తించి తక్షణమే సరిదిద్దారు. ప్రీ-ఫైనల్ గ్రాండ్ టెస్టుల నిర్వహణ ద్వారా విద్యార్థుల్లో పరీక్షల పట్ల ఉన్న భయాన్ని పోగొట్టి ఆత్మవిశ్వాసాన్ని నింపారు.
విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారిని వర్గీకరించడం ద్వారా ప్రత్యేక బోధన అందించారు. ఏ, బి గ్రేడ్ సాధించిన విద్యార్థులను “షైనింగ్ స్టార్స్”గా గుర్తించి వారిని మరింత మెరుగుపరిచేలా శిక్షణ ఇచ్చారు. అదేవిధంగా సి, డి గ్రేడ్ విద్యార్థులను “రైజింగ్ స్టార్స్”గా పరిగణించి, వారు సులువుగా ఉత్తీర్ణత సాధించేలా బోధనా పద్ధతులను మార్చారు. వెనుకబడిన విద్యార్థుల కోసం నిర్వహించిన 30 రోజుల రెసిడెన్షియల్ శిక్షణ ఈ ఫలితాల్లో కీలక పాత్ర పోషించింది.
ఇక బోధనను సరళతరం చేసేందుకు ప్రభుత్వం ద్విభాషా (తెలుగు-ఇంగ్లీష్) మెటీరియల్స్, గ్రేడెడ్ ప్రశ్న బ్యాంకులు, మోడల్ పేపర్లను విద్యార్థులకు అందజేసింది. ప్రతి పాఠశాలకు 15 రకాల కార్యచరణ పుస్తకాలను పంపిణీ చేశారు. అయితే కేవలం చదువుపైనే కాకుండా విద్యార్థుల సంక్షేమంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. పౌష్టికాహారం (మధ్యాహ్న భోజనం), ఉచిత యూనిఫారాలు, పుస్తకాలు, నోట్‌బుక్స్‌తో పాటు కుటుంబాలకు అందించిన ఆర్థిక సాయం విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడానికి వారు ఏకాగ్రతతో చదవడానికి దోహదపడ్డాయి.
మొత్తానికి ప్రభుత్వం అమలు చేసిన ఈ వినూత్న సంస్కరణలు రాష్ట్ర విద్యా వ్యవస్థలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాయని ఉత్తీర్ణత శాతంలో వచ్చిన పెరుగుదలే దీనికి నిదర్శనమని విద్యాశాఖ పేర్కొంది.
