Let's talk: editor@tmv.in
మహిళా రిజర్వేషన్ అమలుకు అన్ని పార్టీల మద్దతు కావాలి: ప్రధాని మోడీ

మహిళా రిజర్వేషన్ అమలుకు అన్ని పార్టీల మద్దతు కావాలి: ప్రధాని మోడీ

Pinjari Chand
15 ఏప్రిల్, 2026

మహిళల రిజర్వేషన్ చట్టం అమలుకు అవసరమైన సవరణలకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. ఇది దేశ ప్రజల సమిష్టి ఆకాంక్ష అని ఆయన పేర్కొన్నారు. డెహ్రాడూన్‌లో జరిగిన ప్రజా సభలో మాట్లాడుతూ, 2029 లోక్‌సభ ఎన్నికల నుంచి మహిళలకు రిజర్వేషన్ అమలుకు ‘నారీ శక్తి వందన్ అధినియమ్’కు అవసరమైన చట్ట సవరణలను పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఆమోదించాలని కోరారు. దేశంలోని సోదరీమణుల హక్కులకు సంబంధించిన ఈ కీలక నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని రాజకీయ పార్టీలు కలిసికట్టుగా పనిచేయాలని ప్రధాని అన్నారు.

2023 సెప్టెంబర్‌లో పార్లమెంట్ ఆమోదించిన ‘నారీ శక్తి వందన్ అధినియమ్’(మహిళల రిజర్వేషన్ చట్టం) ప్రకారం లోక్‌సభతో పాటు రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు మూడొంతుల సీట్ల రిజర్వేషన్ కల్పించింది.

మహిళల పాత్ర కీలకం

భారత్ అభివృద్ధి దిశగా సాగేందుకు మహిళల పాత్ర అత్యంత కీలకమని ప్రధాని పేర్కొన్నారు. 2029 ఎన్నికల్లో మహిళల రిజర్వేషన్ పూర్తిగా అమలులోకి వస్తే భారత ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని ఆయన అన్నారు. దేశంలోని సోదరీమణులకు లేఖ రాసి ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరినట్లు ప్రధాని వెల్లడించారు.

సామాజిక న్యాయం పట్ల ప్రభుత్వ కట్టుబాటు

డాక్టర్ బీఆర్‌‌. అంబేద్కర్‌‌ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన ప్రధాని, రాజ్యాంగ విలువలను కాపాడటం తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు చేసిన తర్వాత దేశవ్యాప్తంగా రాజ్యాంగం పూర్తిగా అమలులోకి వచ్చిందని అన్నారు. పేదలు, వెనుకబడిన వర్గాలకు నిజమైన సామాజిక న్యాయం అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. దేశంలో సమానత్వం సాధించేందుకు యూసీసీ అమలు అవసరమని రాజ్యాంగం సూచిస్తుందని, ఈ దిశగా ఉత్తరాఖండ్ రాష్ట్రం ముందడుగు వేసిందని అన్నారు.

ఢిల్లీ–డెహ్రాడూన్ కారిడార్ ప్రారంభం

ఈ సందర్భంగా ప్రధాని ఢిల్లీ–డెహ్రాడూన్ ఆర్థిక కారిడార్‌‌ను ప్రారంభించారు. సుమారు 213 కిలోమీటర్ల పొడవు గల ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి రూ.12,000 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కారిడార్ ప్రారంభంతో ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ ప్రయాణ సమయం 6 గంటల నుంచి సుమారు 2.5 గంటలకు తగ్గనుంది. ఈ ప్రాజెక్టులో 10 ఇంటర్‌చేంజ్‌లు, 3 రైల్వే ఓవర్ బ్రిడ్జ్‌లు, 4 ప్రధాన వంతెనలు, 12 మార్గమధ్య సదుపాయాలు నిర్మించారు. అటవీ ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకుని 12 కిలోమీటర్ల వన్యప్రాణి ఎలివేటెడ్ కారిడార్ కూడా నిర్మించారు. ఇది ఆసియాలోనే పొడవైన వన్యప్రాణి కారిడార్‌లలో ఒకటిగా పేర్కొంటున్నారు.

పర్యాటకాభివృద్ధికి ఊతం

ఈ కారిడార్ వల్ల ఉత్తరాఖండ్‌లో పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రధాని అన్నారు. రాష్ట్రంలో శీతాకాల పర్యాటకం, క్రీడల అభివృద్ధికి కూడా ఇది దోహదం చేస్తుందని తెలిపారు. హరిద్వార్‌లో వచ్చే ఏడాది జరిగే కుంభమేళాను పరిశుభ్రంగా, ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ప్రధాని మా దాత్ కాళీ దేవాలయంలో ప్రత్యేక పూజలు కూడా చేశారు.