
వలసదారులు కూడా ‘అమెరికా ఫస్ట్’ అని భావించాలి: జేడీ వాన్స్
అమెరికా పౌరసత్వం పొందిన వలసదారులు తమను తాము ముందుగా అమెరికన్లమని భావించాలని, తాము వచ్చిన దేశాల కంటే అమెరికా ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సూచించారు. మంగళవారం జార్జియా యూనివర్సిటీలో జరిగిన 'టర్నింగ్ పాయింట్ యూఎస్‌ఏ' కార్యక్రమంలో విద్యార్థులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా అమెరికాలో స్థిరపడిన విదేశీయులు, వలస విధానం, పౌరుల బాధ్యతలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
మావయ్యే నాకు స్ఫూర్తి
తన సతీమణి ఉష భారతీయ వలసదారుల కుమార్తె అని వాన్స్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. నా సతీమణి తండ్రి రాధాకృష్ణ చిలుకూరి 1980ల్లో భారత్ నుంచి ఇక్కడికి వచ్చారు. ఇక్కడే చదువుకుని అమెరికా పౌరసత్వం పొందారు. అయితే ఆయన తన జీవితంలో ఎప్పుడూ తన మాతృదేశం (భారత్) ప్రయోజనాల కోసం నన్ను ఏదో ఒకటి చేయమని కోరలేదు. ఆయన ఎప్పుడూ ఒక అమెరికన్‌గానే ఆలోచిస్తారు. కొత్త తరం వలసదారుల్లో కూడా ఇలాంటి దృక్పథమే ఉండాలి" అని ఆయన పేర్కొన్నారు.
మతాలు, ప్రాంతాల కంటే దేశమే ముఖ్యం
అమెరికా పౌరసత్వం తీసుకున్న తర్వాత, మీ కుటుంబం ఇక్కడ తొమ్మిది తరాలుగా ఉంటుందా లేదా అనేది ముఖ్యం కాదని వాన్స్ స్పష్టం చేశారు. "మీరు ఏ వర్గం నుంచి వచ్చారు, ఏ దేశం నుంచి వచ్చారు అనేది పక్కన పెట్టి.. దేశ ప్రయోజనాల కోసం ఏం చేయాలనే బాధ్యతను గుర్తించాలి. ప్రతి ఒక్కరూ తమను తాము అమెరికన్లుగా భావించినప్పుడే ఈ వ్యవస్థ విజయవంతంగా నడుస్తుంది. మన బాధ్యత అంతా అమెరికా వైపే ఉండాలి" అని ఆయన నొక్కి చెప్పారు.
ఉక్రెయిన్ పౌరుడితో సంభాషణ గుర్తుచేస్తూ..
గతంలో తన సెనేట్ ఎన్నికల ప్రచార సమయంలో ఎదురైన ఒక అనుభవాన్ని వాన్స్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. "ఒక ఉక్రెయిన్ సంతతి అమెరికన్ తన మాతృదేశానికి మద్దతుగా ఏదైనా చేయమని నన్ను కోరారు. దానికి నేను సమాధానమిస్తూ.. 'సార్, మీరు అమెరికన్ అయితే మీ దేశం అమెరికానే, మీరు ఎప్పుడో వలస వచ్చిన దేశం కాదు' అని సున్నితంగానే చెప్పాను. మనం ఎక్కడి నుంచి వచ్చినా, ఇప్పుడు మన చూపు అమెరికా అభివృద్ధిపైనే ఉండాలి" అని వాన్స్ వివరించారు.
హెచ్-1బీ వీసాలో మోసాలు
సెమినార్ లో పాల్గొన్న ఒక భారత సంతతి విద్యార్థిని.. తన తల్లిదండ్రులకు ఇంకా గ్రీన్ కార్డులు రాకపోవడం, హెచ్-1బీ వీసా విధానంలో జరుగుతున్న మోసాల గురించి వాన్స్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఉపాధ్యక్షుడు.. హెచ్-1బీ వ్యవస్థలో అనేక అవకతవకలు, మోసాలు జరుగుతున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. గతంలో అమెరికాకు వచ్చిన వారు ఈ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని, అయితే వ్యవస్థలోని లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
వలస విధానంపై స్పష్టత
అమెరికాను ప్రేమించే వారిని, అమెరికా బాధ్యతలను స్వీకరించే వారిని తాము ఎప్పుడూ ఆహ్వానిస్తామని వాన్స్ తెలిపారు. అమెరికన్లుగా మారాక అమెరికా ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని (అమెరికన్స్ ఫస్ట్), ఇదే తమ వలస విధానంలో కీలకమైన అంశమని ఆయన స్పష్టం చేశారు. ఈ దృక్పథం ఉన్నప్పుడే వలసదారుల పట్ల స్థానికులకు కూడా గౌరవం పెరుగుతుందని ఆయన తన ప్రసంగాన్ని ముగించారు. కాగా జేడీ వాన్స్ వ్యాఖ్యలు ఇప్పుడు అమెరికాలోని వలసదారుల్లో, ముఖ్యంగా భారత సంతతి వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
