Let's talk: editor@tmv.in
‘డయల్ యువర్ ఎమ్మెల్యే’లో సమస్యలకు తక్షణ పరిష్కారం: గళ్ళా మాధవి

‘డయల్ యువర్ ఎమ్మెల్యే’లో సమస్యలకు తక్షణ పరిష్కారం: గళ్ళా మాధవి

Gaddamidi Naveen
18 జూన్, 2026

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి "వే టూ న్యూస్" ఆధ్వర్యంలో నిర్వహించిన "డయల్ యువర్ ఎమ్మెల్యే" కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలను నేరుగా విని, సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.

ఏటి అగ్రహారం 4వ లైన్‌లో పోలేరమ్మ గుడి వద్ద వీధి దీపాలు వెలగడం లేదన్న ఫిర్యాదుపై అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు. అడవి తక్కెళ్లపాడు రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో డ్రైనేజీ, రోడ్ల సమస్యలపై నగర కమిషనర్ మయూర్ అశోక్‌తో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. పీఎస్ నగర్‌లో డ్రైనేజీ సమస్య, వి.ఐ.పి రోడ్డు-కావేరి నగర్‌లో నీటి సరఫరా సమస్య, కోబాల్ట్‌పేటలో కాలువ నీరు రోడ్లపైకి రావడం, ఆటోల అక్రమ పార్కింగ్ వంటి అంశాలపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.

నల్లకుంట రెడ్డి కాలేజీ వెనుక గంజాయి ముఠాల సంచారంపై ఫిర్యాదు రావడంతో నల్లపాడు సీఐతో మాట్లాడి బీట్ కానిస్టేబుళ్ల పర్యవేక్షణను పెంచాలని ఆదేశించారు. స్వామి థియేటర్ వెనుక రాజరాజేశ్వరిపురంలో లో-వోల్టేజ్ సమస్యపై విద్యుత్ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. ఏటి అగ్రహారం రామిరెడ్డి నగర్‌లో వర్షాకాలంలో నీరు నిలిచే సమస్య పరిష్కారమవడంతో స్థానికులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. 22ఏ భూ సమస్య, శ్యామల నగర్‌లో స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు, జనన ధృవీకరణ పత్రం జారీ ఆలస్యం, శానిటేషన్ సమస్యలపై కూడా పరిష్కారానికి హామీ ఇచ్చారు.

ప్రజలకు అందుబాటులో ఉండటం తన బాధ్యత అని పేర్కొన్న ఎమ్మెల్యే గళ్ళా మాధవి, "డయల్ యువర్ ఎమ్మెల్యే" వంటి కార్యక్రమాలు ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఉపయోగపడతాయని, ప్రతి ఫిర్యాదుపై కచ్చితంగా ఫాలోఅప్ చేస్తామని స్పష్టం చేశారు.