
అడవి జంతువుల అక్రమ వేట..ప్రొఫెషనల్ షూటర్ సహా ఆరుగురు అరెస్ట్
తెలంగాణలోని షాద్‌నగర్, మక్తల్ అటవీ ప్రాంతాల్లో మూగజీవాలను వేటాడుతున్న ఆరుగురు సభ్యుల ముఠాను పోలీసులు, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో సోమవారం జరిపిన మెరుపు దాడిలో వేట సాగిస్తుండగానే వీరు పట్టుబడ్డారు. విస్తుపోయే విషయమేమిటంటే అరెస్టయిన వారిలో తెలంగాణ రైఫిల్ అసోసియేషన్‌కు చెందిన ఒక ప్రొఫెషనల్ షూటర్ కూడా ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు.
కమిషనర్ టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ ఎ. శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం ఈ ముఠా ఎయిర్‌గన్లను ఉపయోగించి జింకలు, నెమళ్లు, కుందేళ్లు, క్వెయిల్ పక్షులు, పావురాలను లక్ష్యంగా చేసుకుని వేటాడుతోంది. నిందితుల నుంచి నాలుగు ఎయిర్‌గన్లు, 20 బుల్లెట్లతో కూడిన ఒక లైసెన్స్డ్ రైఫిల్, ఒక కారు, ఎనిమిది మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరు తాము వేటాడే దృశ్యాలను ఫోటోలు, వీడియోలు కూడా తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
దర్యాప్తులో భాగంగా 42 ఏళ్ల వయసున్న ప్రధాన నిందితుడు ఒక పక్షుల వ్యాపారి అని తేలింది. ఇతను గత ఏడాది జనవరి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు తన స్నేహితులతో కలిసి పలుమార్లు అడవి జంతువులను వేటాడి వాటి మాంసాన్ని వినియోగించినట్లు ఒప్పుకున్నాడు. వేట ముగిసిన తర్వాత జంతువుల అవశేషాలను సమీపంలోని కాల్వల్లో పడేసి ఆధారాలను మాయం చేసేవారని పోలీసులు గుర్తించారు.కాగా అరెస్టు చేసిన నిందితులను తదుపరి చర్యల కోసం హైదరాబాద్ ఈస్ట్ రేంజ్ అటవీశాఖ అధికారులకు అప్పగించారు. నిందితులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం (1972) కింద కేసులు నమోదు చేశారు
