Let's talk: editor@tmv.in
ప్రశ్నిస్తే సంకెళ్లా..చంద్రబాబు సర్కార్‌పై వైఎస్ జగన్ ధ్వజం

ప్రశ్నిస్తే సంకెళ్లా..చంద్రబాబు సర్కార్‌పై వైఎస్ జగన్ ధ్వజం

Panthagani Anusha
19 ఏప్రిల్, 2026

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు . రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు కనుమరుగయ్యాయని ప్రశ్నించే గొంతుకలను అణిచివేయడమే లక్ష్యంగా పాలన సాగుతోందని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ కక్ష సాధింపు కోసం ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఇది ముమ్మాటికీ రాజ్యాంగ ఉల్లంఘనేనని జగన్ మండిపడ్డారు.

ప్రభుత్వ అవినీతిని అక్రమాలను ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయించడం ఏ రకమైన పరిపాలన అని జగన్ ప్రశ్నించారు. జర్నలిస్టులు వాస్తవాలను ప్రజల ముందు ఉంచితే ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతోందని నిలదీశారు. వాస్తవాలు మాట్లాడటం దేశద్రోహం ఎలా అవుతుందని ప్రశ్నిస్తూ జర్నలిస్టులపై కక్ష కట్టడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని ఆయన వ్యాఖ్యానించారు. అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని విమర్శించారు.

కాగా సీనియర్ జర్నలిస్ట్ పూడి శ్రీహరిపై జరిగిన పోలీసు చర్యలను జగన్ తీవ్రంగా ఖండించారు. బీసీ వర్గానికి చెందిన ఒక సీనియర్ జర్నలిస్టును టెర్రరిస్టులా చిత్రీకరిస్తూ ఆయన నివాసంలో సోదాలు చేయడం అరాచకానికి పరాకాష్ట అని పేర్కొన్నారు. అదేవిదంగా తెలంగాణకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ కేవీఆర్ కుటుంబ సభ్యులను పోలీసులు వేధించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇంట్లో మగవారు లేని సమయంలో కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేయడం ‘రెడ్ బుక్’ పాలనకు నిదర్శనమని ఇది అచ్చంగా ‘జంగిల్ రాజ్’ (అడవి పాలన)ను తలపిస్తోందని దుయ్యబట్టారు.

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా తయారైందని మహిళలు, బాలికలపై నిత్యం దాడులు, అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమైన ప్రభుత్వం కేవలం సోషల్ మీడియా పోస్టులను విమర్శలను అడ్డుకోవడానికే ప్రాధాన్యత ఇస్తోందని మండిపడ్డారు. అధికార పార్టీ నేతలు తప్పులు చేస్తే చూసీచూడనట్లు వ్యవహరించడం సుపరిపాలన అనిపించుకోదని హితవు పలికారు.

కాగా ముఖ్యమంత్రి తన బాధ్యతలను విస్మరించి కక్ష సాధింపులకే పరిమితమైతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రజల స్వేచ్ఛను హరించి భయంతో పాలన సాగించాలనుకోవడం భ్రమ అని ప్రజలు త్వరలోనే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రశ్నిస్తే సంకెళ్లా..చంద్రబాబు సర్కార్‌పై వైఎస్ జగన్ ధ్వజం - Tholi Paluku