Let's talk: editor@tmv.in
దమ్ముంటే నా సవాల్ స్వీకరించు.. కేటీఆర్‍కు మంత్రి పొంగులేటి చాలెంజ్

దమ్ముంటే నా సవాల్ స్వీకరించు.. కేటీఆర్‍కు మంత్రి పొంగులేటి చాలెంజ్

Gaddamidi Naveen
30 మే, 2026

ఇందిరమ్మ ఇళ్ల అంశంపై తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం తీవ్రతరం అయ్యింది. తెలంగాణ గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని రిఫరెండంగా పేర్కొంటూ కేటీఆర్‌కు ఆయన ఒక బహిరంగ సవాల్ విసిరారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల అభివృద్ధి గురించి మాట్లాడే దమ్ము లేకనే, కేటీఆర్ హైదరాబాద్ ఇండ్ల అంశాన్ని పట్టుకుని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వం కాబట్టే, తొలి రెండున్నర సంవత్సరాలలోనే గ్రామాల్లో 4.5 లక్షల ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించిందని గుర్తుచేశారు. జూన్ 1న మరో 2.5 లక్షల ఇండ్లను, అలాగే హైదరాబాద్ పరిధిలో తొలి విడతగా లక్ష ఇందిరమ్మ ఇండ్లను నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో కట్టిన ఇండ్ల కంటే, కేవలం రెండున్నర ఏళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మూడు రెట్లు ఎక్కువ ఇండ్లు నిర్మించిందని స్పష్టం చేశారు.

అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో బీజేపీ ముందు మోకరిల్లారని పొంగులేటి ఆరోపించారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని మోడీ, ఎంపీ సీఎం రమేష్, కవిత ప్రస్తావించారని గుర్తుచేశారు. కేసుల మాఫీ కోసం కాషాయ నేతల కాళ్లు పట్టుకున్న కేటీఆర్‌కు పౌరుషం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. దళిత ముఖ్యమంత్రి నుంచి డబుల్ బెడ్రూం ఇండ్ల వరకు బీఆర్ఎస్ అన్నీ అబద్ధాలే చెప్పిందని, కేటీఆర్ అవినీతి గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందని ఎద్దేవా చేశారు. ధరణి దందాలు, బినామీ బాగోతాలతో పదేళ్లలో విచ్చలవిడిగా దోచుకున్నారని ధ్వజమెత్తారు.

దమ్ముంటే నా సవాల్ స్వీకరించు

హైదరాబాద్‌లో ఇండ్ల నిర్మాణంపై కేటీఆర్‌కు మరొక్కసారి సవాల్ విసురుతున్నా. 2014 కు ముందు మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి? పదేళ్లు అధికారంలో ఉండి విచ్చలవిడిగా ఎలా దోచుకున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కట్టిన ఇండ్ల కంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ఇండ్లు నిర్మిస్తేనే నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా. ఒకవేళ కాంగ్రెస్ ఎక్కువ ఇండ్లు నిర్మిస్తే.. మీరు ఎన్నికల పోటీకి దూరంగా ఉంటారా? దమ్ముంటే నా సవాల్‌ను స్వీకరించు కేటీఆర్! అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు.