Let's talk: editor@tmv.in
అధికారంలోకి వస్తే హైదరాబాద్‌లో 24 గంటల తాగునీటి సరఫరా చేస్తాం: కేటీఆర్

అధికారంలోకి వస్తే హైదరాబాద్‌లో 24 గంటల తాగునీటి సరఫరా చేస్తాం: కేటీఆర్

Gaddamidi Naveen
26 మే, 2026

బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ నగరంలోని ప్రతి ఇంటికీ 24 గంటల పాటు స్వచ్ఛమైన తాగునీటి సరఫరా అందిస్తామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. కూకట్‌పల్లిలో జరిగిన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. నాడు కరెంట్ కష్టాలతో అల్లాడిన తెలంగాణను నిరంతర 24 గంటల విద్యుత్ సరఫరా రాష్ట్రంగా ఎలాగైతే మార్చామో, అదే రీతిలో భవిష్యత్తులో హైదరాబాద్‌కు 24 గంటలు నిరంతరంగా తాగునీటిని అందిస్తామని హామీ ఇచ్చారు.

ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో ప్రజలు సుదీర్ఘ పవర్ కట్లు, తీవ్ర తాగునీటి ఎద్దడిని ఎదుర్కొన్నారని కేటీఆర్ గుర్తుచేశారు. "ఆనాడు కరెంట్, నీళ్ల కోసం ధర్నాలు, ఆందోళనలు నిత్యకృత్యంగా ఉండేవి. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ నాయకత్వంలో 24 గంటల ఉచిత విద్యుత్‌ను విజయవంతంగా అమలు చేయడమే కాకుండా, ‘మిషన్ భగీరథ’ ద్వారా ప్రతి ఇంటికీ పైపుల ద్వారా తాగునీరు అందించాం. నాడు కరెంట్ విషయంలో కేసీఆర్ చూపిన అదే పట్టుదలను, ఇప్పుడు హైదరాబాద్‌లో 24 గంటల తాగునీటి సరఫరా కోసం ఉపయోగిస్తాం. ఈ కార్యక్రమ బాధ్యతను నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను" అని స్పష్టం చేశారు.

హైదరాబాద్ అభివృద్ధిని కాంగ్రెస్ గాలికొదిలేసింది

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలతో సమాజంలోని ప్రతి వర్గాన్ని మోసం చేసిందని కేటీఆర్ మండిపడ్డారు. పెంచిన పింఛన్ల నుంచి మహిళలకు నెలవారీ ఆర్థిక సహాయం వరకు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. దాదాపు రెండున్నర సంవత్సరాల పాలన పూర్తవుతున్నా, హైదరాబాద్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క అదనపు రూపాయి కూడా ఖర్చు చేయలేకపోయిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఫ్లైఓవర్లు, ఆసుపత్రులు, మౌలిక వసతుల ప్రాజెక్టులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తూ.. తామే కట్టినట్లు కలరింగ్ ఇస్తూ రిబ్బన్లు కట్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్‌లో కనీసం ఒక్క డబుల్ బెడ్‌రూమ్ ఇల్లైనా కట్టించారా? అని కేటీఆర్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ పాలనలో ఒక్కటంటే ఒక్క డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కట్టినట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ప్రకటించారు. కాంగ్రెస్ వైఖరి తెలిసే హైదరాబాద్ ప్రజలు ఆ పార్టీని నగరంలో ఒక్క సీటులో కూడా గెలిపించలేదన్నారు. కాంగ్రెస్ విధానాల వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా దెబ్బతిన్నదని, దీనివల్ల నిర్మాణ రంగ కార్మికులు, సెంటరింగ్ కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే నిర్మాణ రంగానికి చెందిన కార్మికుల కోసం ప్రత్యేక బీమా, సంక్షేమ పథకాలను ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు.

ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలి

2027లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందుగా, కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా మూడో విడత ‘ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ’ (స‌ర్) కార్యక్రమాన్ని చేపట్టబోతోందని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలు నమోదు చేయించే తప్పుడు, డూప్లికేట్ ఓట్లపై బూత్ స్థాయి కార్యకర్తలు వ్యూహాత్మకంగా వ్యవహరించి అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఏ ఒక్క నిజమైన ఓటరు కూడా తమ ఓటు హక్కును కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.