Let's talk: editor@tmv.in
కార్మికుల కడుపు కొడితే పతనం తప్పదు.. జీవో 975ను వెనక్కి తీసుకోవాలి: వైఎస్ షర్మిల

కార్మికుల కడుపు కొడితే పతనం తప్పదు.. జీవో 975ను వెనక్కి తీసుకోవాలి: వైఎస్ షర్మిల

Gaddamidi Naveen
9 జులై, 2026

మున్సిపల్ కార్మికుల కడుపు కొట్టి, కార్పొరేట్ సంస్థలకు లాభాలు కట్టబెట్టేలా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 975ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి లేఖ రాస్తున్నట్లు బుధవారం తన 'ఎక్స్' వేదికగా ప్రకటించారు.

ప్రైవేటీకరణ పేరుతో మున్సిపల్ సేవలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు వేలాది కార్మిక కుటుంబాల జీవితాలను సంక్షోభంలోకి నెట్టేస్తాయని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల కోసం రాత్రింబవళ్లు శ్రమించే మున్సిపల్ కార్మికులను రోడ్డున పడేసే హక్కు ఏ ప్రభుత్వానికీ లేదని స్పష్టం చేశారు. కార్మికుల కడుపు కొట్టి కార్పొరేట్లకు లాభాలు చేకూర్చే విధానాలను కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని హెచ్చరించారు.

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ ప్రజా ప్రయోజనాలను విస్మరిస్తోందని షర్మిల విమర్శించారు. పట్టణాలను పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం శ్రమించే మున్సిపల్ కార్మికుల కుటుంబాల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆరోపించారు.

సింగపూర్, కొరియా దేశాల్లో తిరుగుతూ ఏఐ, క్వాంటం అంటూ కబుర్లు చెప్పే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, కులమతాల గొడవలకు ఆజ్యం పోసేందుకే పదవి తీసుకున్నట్లు వ్యవహరిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అమరావతిలోనే కాలక్షేపం చేస్తున్న మున్సిపల్ మంత్రి.. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని హెచ్చరించారు.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు విరుద్ధంగా ఉన్న ఉద్యోగాలనే ప్రమాదంలోకి నెడుతోందని ఆరోపించారు.

ప్రజారంజకంగా పాలించకపోతే మునుపటి పాలకుల లాగే మిమ్మల్ని కూడా ప్రజలు పాతాళానికి తొక్కేస్తారు. మున్సిపల్ కార్మికుల న్యాయమైన పోరాటానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ బేషరతుగా మద్దతు ఇస్తుందని షర్మిల స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే, రాబోయే ప్రజల ఆగ్రహానికి, కార్మిక ఉద్యమానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని ఆమె హెచ్చరించారు.

ట్యాగ్‌లు
YSSharmilaAPCongressMunicipalWorkersGO975PrivatizationSaveMunicipalWorkersWorkersRightsAndhraPradeshChandrababuNaidu
కార్మికుల కడుపు కొడితే పతనం తప్పదు.. జీవో 975ను వెనక్కి తీసుకోవాలి: వైఎస్ షర్మిల - Tholi Paluku