

హైదరాబాద్‌లో ఐసీఏఆర్ 'స్పీడ్ బ్రీడింగ్' కేంద్రం ప్రారంభం
హైదరాబాద్‌లోని ఐసీఏఆర్-భారతీయ వరి పరిశోధన సంస్థలో రూ. 12 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అత్యాధునిక 'స్పీడ్ బ్రీడింగ్' సౌకర్యానికి ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ మాంగీలాల్ జాట్ శంకుస్థాపన చేశారు. దీనితో పాటు రూ. 1.6 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆధునిక విత్తన గిడ్డంగిని కూడా ఆయన ప్రారంభించారు. దేశంలో వరి పరిశోధనలను మరింత వేగవంతం చేసే దిశగా ఈ ప్రాజెక్టులు కీలక అడుగుగా నిలవనున్నాయి.
ఈ స్పీడ్ బ్రీడింగ్ సౌకర్యం ప్రధానంగా వరి వంగడాల అభివృద్ధి సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. సాధారణంగా ఒక కొత్త వరి రకాన్ని అభివృద్ధి చేయడానికి పట్టే సమయాన్ని సగానికి పైగా తగ్గించి, తక్కువ కాలంలోనే అధిక దిగుబడినిచ్చే, వాతావరణ మార్పులను తట్టుకునే రకాలను రూపొందించడానికి ఇది ఉపయోగపడుతుంది. వాతావరణ స్థితిగతులను నియంత్రించడం ద్వారా సంవత్సరానికి ఎక్కువ పంట కాలాలను పొందేలా ఈ కేంద్రం రూపొందించబడింది.
మరోవైపు, కొత్తగా ప్రారంభించిన ఆధునిక విత్తన గిడ్డంగి నాణ్యమైన విత్తనాల నిల్వకు భరోసా ఇస్తుంది. శాస్త్రీయ పద్ధతుల్లో విత్తనాలను భద్రపరచడం ద్వారా వాటి మొలకల సామర్థ్యాన్ని కాపాడవచ్చని, తద్వారా రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. విత్తన వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ గిడ్డంగి కీలక పాత్ర పోషించనుంది.
ఈ సందర్భంగా మాంగీలాల్ జాట్ మాట్లాడుతూ.. 'వికసిత్ భారత్' కోసం 'వికసిత్ కృషి' (అభివృద్ధి చెందిన వ్యవసాయం) ఎంతో అవసరమని పేర్కొన్నారు. వాతావరణ మార్పులను తట్టుకునే, పోషక విలువలు కలిగిన వరి వంగడాలను రైతులకు అందించడమే లక్ష్యంగా పరిశోధనలు సాగాలని పిలుపునిచ్చారు. అధునాతన సాంకేతికతను సామాన్య రైతులకు చేరవ చేయడంలో ఐసీఏఆర్-ఐఐఆర్ఆర్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఐసీఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డి.కె. యాదవ, ఐఐఆర్ఆర్ డైరెక్టర్ ఆర్.ఎం. సుందరం తదితరులు పాల్గొన్నారు. అనంతరం సంస్థలోని శాస్త్రవేత్తలు, సాంకేతిక, పరిపాలనా సిబ్బందితో జాట్ ముచ్చటించారు. దేశ ఆహార భద్రతలో వరి పరిశోధనల ప్రాముఖ్యతను వివరిస్తూ, భవిష్యత్తులో మరిన్ని వినూత్న ఆవిష్కరణలు రావాలని ఆయన ఆకాంక్షించారు.
