


ఇకపై అంత మంచివాడిలా ఉండను: ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
అణు ఒప్పందం విషయంలో ఇరాన్ మొండివైఖరి వీడకుంటే ఇకపై ఉపేక్షించేది లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్ ఖాతాలో తుపాకీ పట్టుకుని ఉన్న ఏఐ చిత్రాన్ని పోస్ట్ చేస్తూ.. " ఇకపై నేను అంత మంచివాడిలా ఉండను " అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చర్చల ద్వారా శాంతియుత పరిష్కారానికి ఇరాన్ సహకరించడం లేదని మండిపడ్డ ట్రంప్.. వెంటనే తెలివి తెచ్చుకుని అణు రహిత ఒప్పందంపై సంతకం చేయాలని, లేదంటే ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
నౌకా దిగ్బంధనంతో ఉక్కిరిబిక్కిరి
అమెరికా విధిస్తున్న కఠినమైన నౌకా దళ దిగ్బంధనం వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థితికి చేరింది. ఇరాన్ ఓడరేవులకు వచ్చే నౌకలను అమెరికా అడ్డుకోవడమే కాకుండా, ఆ దేశ చమురు ఎగుమతులను పూర్తిగా స్తంభింపజేస్తోంది. ఈ వ్యూహం ద్వారా యుద్ధం కంటే కూడా ఆర్థికంగా ఇరాన్‌ను లొంగదీసుకోవాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది.
ఆపరేషన్ ఫ్యూరీతో చెక్
ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు అమెరికా ట్రెజరీ శాఖ ‘ఆపరేషన్ ఫ్యూరీ’ని అమలు చేస్తోంది. దీని ద్వారా ఇరాన్ అంతర్జాతీయ షాడో బ్యాంకింగ్, క్రిప్టో కరెన్సీ లావాదేవీలు, చైనాకు చేసే రహస్య చమురు ఎగుమతులపై ఉక్కుపాదం మోపుతోంది. దీని ఫలితంగా ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ మునుపెన్నడూ లేని విధంగా పడిపోయింది. ప్రస్తుతం ఒక అమెరికా డాలర్ విలువ 1.8 మిలియన్ రియాల్‌లకు చేరి రికార్డు సృష్టించింది.
అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇరాన్ తన చమురు నిల్వ కేంద్రాల సామర్థ్యం గరిష్ఠ స్థాయికి చేరడంతో ఉత్పత్తిని తగ్గించక తప్పని స్థితిలో ఉంది. దీనివల్ల ఆ దేశానికి ప్రతిరోజూ సుమారు 170 మిలియన్ డాలర్ల ఆదాయం గండి పడుతోంది. ఈ పరిస్థితి ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలకు దీర్ఘకాలిక నష్టం కలిగిస్తుందని ఆయన విశ్లేషించారు.
ఇరాన్ మూడు దశల శాంతి ప్రతిపాదన
ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఒక కొత్త ప్రతిపాదనను తెచ్చారు. అమెరికా దిగ్బంధనాన్ని ఎత్తివేసి, యుద్ధాన్ని ఆపితే తాము హర్ముజ్ జలసంధిని తెరుస్తామని మధ్యవర్తుల ద్వారా సమాచారం పంపారు. ఇందులో మూడు దశల ప్రణాళికను ఇరాన్ వివరించింది. యుద్ధాన్ని ఆపి, మళ్లీ దాడులు చేయబోమని అమెరికా, ఇజ్రాయెల్ గ్యారెంటీ ఇవ్వాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది.
అమెరికా ససేమిరా
అయితే అణు చర్చలను ప్రస్తుతానికి వాయిదా వేసి కేవలం ఆర్థిక అంశాలపైనే మాట్లాడాలన్న ఇరాన్ మెలికను ట్రంప్ ప్రభుత్వం తోసిపుచ్చింది. అణు సమస్యను నేరుగా పరిష్కరించకుండా మరే ఇతర ఒప్పందాన్ని అంగీకరించబోమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. జలసంధిపై ఇరాన్‌కు పూర్తి అధికారం ఇచ్చే ప్రసక్తే లేదని వైట్ హౌస్ తేల్చి చెప్పింది.
ఐరాసకు ఇరాన్ ఫిర్యాదు
సముద్ర మార్గాల్లో తమ నౌకలను అమెరికా స్వాధీనం చేసుకోవడంపై ఇరాన్ భగ్గుమంది. ఇది అంతర్జాతీయ చట్టాల ప్రకారం ‘సముద్రపు దొంగతనం’ అని అభివర్ణించింది. ఈ మేరకు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెర్రస్‌కు ఇరాన్ రాయబారి ఫిర్యాదు చేశారు. అమెరికా తన సొంత చట్టాలను అంతర్జాతీయ వాణిజ్యంపై రుద్దడం ప్రమాదకరమని ఆ లేఖలో పేర్కొన్నారు.
భారత్ తీవ్ర ఆందోళన
హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు జరగడంపై భారత్ ఐక్యరాజ్యసమితిలో ఆందోళన వ్యక్తం చేసింది. భారత ఆర్థిక, ఇంధన భద్రతకు ఈ సముద్ర మార్గం అత్యంత కీలకమని రాయబారి యోజన పటేల్ స్పష్టం చేశారు. యుద్ధంలో భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడం గర్హనీయమని, గల్ఫ్ దేశాల్లో ఉన్న కోటి మంది భారతీయుల భద్రతే తమ తొలి ప్రాధాన్యమని భారత్ వెల్లడించింది.
రూ. 2.30 లక్షల కోట్ల యుద్ధ వ్యయం
ఈ యుద్ధం వల్ల అమెరికాకు కూడా భారీగా ఖర్చవుతోంది. ఇప్పటి వరకు సుమారు 25 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.2.30 లక్షల కోట్లు) వ్యయమైనట్లు పెంటగాన్ తొలిసారి వెల్లడించింది. ఇందులో అత్యధికంగా మందుగుండు సామాగ్రి, క్షిపణుల కొనుగోలుకే ఖర్చయిందని పెంటగాన్ ఆర్థిక అధికారి జూల్స్ హర్స్ట్ కాంగ్రెస్‌కు వివరించారు.
అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కాంగ్రెస్ కమిటీ ముందు హాజరై, వచ్చే ఏడాదికి 1.5 ట్రిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ.140 లక్షల కోట్లు) రికార్డు స్థాయి రక్షణ బడ్జెట్‌ను ప్రతిపాదించారు. యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఓటమి వాదాన్ని వినిపిస్తున్న విపక్ష డెమొక్రాట్లే దేశానికి అతిపెద్ద శత్రువులని ఆయన మండిపడ్డారు. ఇరాన్ అణు ముప్పును అణచివేయడానికి ఈ బడ్జెట్ అవసరమని ఆయన వాదించారు.
పాకిస్థాన్ విలవిల
యుద్ధం సెగ పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థకు తీవ్రంగా తగిలింది. చమురు దిగుమతి బిల్లు వారానికి 300 నుండి 800 మిలియన్ డాలర్లకు పెరిగిందని ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. శాంతిని నెలకొల్పేందుకు ఇస్లామాబాద్ వేదికగా 21 గంటల మారథాన్ చర్చలు జరిపామని, త్వరలో రెండో విడత చర్చలకు ఆతిథ్యం ఇస్తామని వెల్లడించారు.
ఐరోపాకు భారీ నష్టం
ఇంధన ధరల పెరుగుదల వల్ల ఐరోపా సమాఖ్యకు రోజుకు 600 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోందని ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ తెలిపారు. పెట్రోల్ ధరలు పెరగడంతో పాటు, రానున్న వారాల్లో విమాన ఇంధన కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
అణు కేంద్రాల్లో ఉత్కంఠ
ఇరాన్ అణు నిల్వలు ఇంకా ‘ఇస్ఫాహాన్’ కేంద్రంలోనే ఉన్నట్లు ఐఏఈఏ గుర్తించింది. గత ఏడాది బాంబు దాడులు జరిగినప్పటికీ, మెజారిటీ యురేనియం నిల్వలు అక్కడే ఉన్నాయని శాటిలైట్ చిత్రాల ద్వారా తెలుస్తోంది. ఈ నిల్వలను ఇరాన్ నుండి తరలించేందుకు రష్యాతో చర్చలు జరుగుతున్నట్లు ఐఏఈఏ చీఫ్ రాఫెల్ గ్రోసీ వెల్లడించారు.
ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ, ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది. ఒకవైపు ఇరాన్ తన ‘సర్‌ప్రైజ్’ వ్యూహాలతో అమెరికాను హెచ్చరిస్తుండగా, మరోవైపు ట్రంప్ తన ‘నైస్ గై’ ముసుగును తొలగించి గట్టిగా బుద్ధి చెబుతామని సంకేతాలిస్తున్నారు. ఈ యుద్ధ తంత్రం వల్ల ప్రపంచవ్యాప్తంగా సామాన్యులు చమురు ధరల భారాన్ని మోయాల్సి వస్తోంది.
