
మా హయాంలో తెలంగాణ ప్రగతిని మించిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాలు వదిలేస్తా: కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఒక బహిరంగ రాజకీయ సవాల్ విసిరారు. గతంలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన అభివృద్ధి కంటే, ప్రస్తుతం ఆ రెండు పార్టీల పాలనలో ఉన్న ఏ రాష్ట్రమైనా ఎక్కువ పురోగతి సాధించిందని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ఆయన స్పష్టం చేశారు.
మీడియా సమావేశంలో మాట్లాడిన కేటీఆర్, తాను చెబుతున్న పోలికలు అధికారిక సమాచారం ఆధారంగా ఉన్నాయని, ఇవి ఎలాంటి "ఫేక్ నంబర్లు" కావని పేర్కొన్నారు. దీనికోసం కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (సీఏజీ) నివేదికల గణాంకాలను తాను ఆధారంగా చేసుకుంటున్నట్లు తెలిపారు. నేడు దేశంలో కాంగ్రెస్ లేదా బీజేపీ ఎన్నో రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన దానికంటే, మీరు పాలిస్తున్న ఆ 25-26 రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రమైనా ఎక్కువ ప్రగతి సాధించిందని మీరు నిరూపించగలిగితే, నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతాను. ఇది కాంగ్రెస్, బీజేపీలకు నా ఓపెన్ ఛాలెంజ్ అని కేటీఆర్ సవాల్ విసిరారు.
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రానికి అత్యున్నత నాయకుడని కొనియాడిన కేటీఆర్.. ఆయన వారసత్వాన్ని, రక్షణాత్మక నాయకత్వాన్ని పొగుడుతూ ఒక సినిమా ఉదాహరణను ప్రస్తావించారు. ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ అనే సినిమా వచ్చింది, కానీ మాకు తెలంగాణ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ (ఓజీ) కేసీఆర్ గారే. ఆయనే మమ్మల్ని, రాష్ట్రాన్ని, మన సమస్యలను చూసుకుంటారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్
ప్రాంతీయతత్వం అనేది ఉగ్రవాదం కంటే ప్రమాదకరమంటూ జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ఖచ్చితంగా ఇక్కడి భూమిపుత్రులదే అని కేటీఆర్ స్పష్టం చేశారు. మద్రాస్ రాష్ట్రం నుంచి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన ఉద్యమాన్ని కూడా ప్రాంతీయతత్వం అంటారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఒకవైపు తెలంగాణను ప్రాంతీయతత్వం పేరిట విమర్శిస్తూనే, మరోవైపు రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ.. జాతీయవాదం ముసుగులో జరుగుతున్న ఈ ఆర్థిక ప్రాంతీయతత్వం అంగీకారయోగ్యమేనా? అని నిలదీశారు.
దేశభక్తి, పోరాటాల గురించి పవన్ కళ్యాణ్ నుంచి మేము పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నటుడిగా ఆయనను మేము గౌరవిస్తాం, ఒక సోదరుడిగా స్వాగతిస్తాం. కానీ తెలంగాణ రాజకీయాల్లో ఆయన జోక్యాన్ని మాత్రం మేము అంగీకరించబోము. ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణలో, మళ్లీ ఇతరుల ఆధిపత్యాన్ని మేమెందుకు భరించాలి? అని కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
అంతకుముందు, ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన కేటీఆర్ పదో తరగతి వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన టాప్ 30 మంది విద్యార్థులకు ట్యాబ్లెట్లను పంపిణీ చేశారు. గీతానగర్ జిల్లా పరిషత్ హైస్కూల్‌లో జరిగిన ఈ పంపిణీ వేడుకలో ఆయన విద్యార్థులను అభినందించారు. విద్యార్థుల కష్టాన్ని గుర్తిస్తూ అందించిన ఈ ప్రోత్సాహకాలు వారిని మరింత ఉన్నతమైన లక్ష్యాల వైపు నడిపిస్తాయని కేటీఆర్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. నేటి డిజిటల్ యుగంలో విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరమని, భవిష్యత్తులో మరింత విజయాన్ని సాధించడానికి ఈ ట్యాబ్లెట్లను విద్యాభివృద్ధికి సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని ఆయన విద్యార్థులను ప్రోత్సహించారు.
