Let's talk: editor@tmv.in
కులాలను విడగొట్టే రాజకీయాలు చేయను.. కలపడానికే నా ప్రయత్నం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

కులాలను విడగొట్టే రాజకీయాలు చేయను.. కలపడానికే నా ప్రయత్నం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Gaddamidi Naveen
28 జూన్, 2026

నేను కులం కార్డు ఉపయోగించి రాజకీయం చేయలేదు, భవిష్యత్తులో చేయను. నేను కులం గురించి మాట్లాడితే కులాలను కలపడానికే మాట్లాడుతాను తప్ప.. విడగొట్టి రాజకీయం చేయడానికి కాదని జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ‘జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ’ కార్యాచరణ సమావేశంలో ఆయన పాల్గొని, పార్టీ సంస్థాగత నిర్మాణంపై కీలక ప్రసంగం చేశారు.

దేశంలో ఒకరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ అని వేర్వేరు హాస్టల్స్ కాకుండా.. పిల్లలందరూ ఒకే హాస్టల్‌లో కలిసి ఉండే పరిస్థితి రావాలన్నదే తన బలమైన కోరిక అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఏ సామాజికవర్గానికి చెందినవారైనా నాయకత్వం వహించాలంటే మిగతా అన్ని వర్గాల విశ్వాసాన్ని పొందాల్సిందేనని, అందరినీ కలుపుకుని వెళ్లినవారే చరిత్రను నిర్మించారని గుర్తుచేశారు.

వైసీపీ కుల రాజకీయంపై ధ్వజం

ఒక కుర్రాడు 14 ఏళ్ల ఆడబిడ్డను మూడు రోజుల పాటు గదిలో బంధించి దారుణంగా హింసిస్తే, వాడికి వత్తాసుగా వైయస్సార్‌సీపీ నాయకులంతా వెళ్లడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఒక ప్రొఫెషనల్ క్రిమినల్ కేవలం మీ కులం వాడు అనే ఒకే ఒక్క కారణంతో ఎలా వెనకేసుకొస్తారు? కులం ఎప్పుడూ ఇంటి గడప లోపలే ఆగిపోవాలి. గడప దాటితే సంస్కృతి, భాష, ధర్మాలు బాధ్యత కావాలి. ఇంకో పది అడుగులు వేస్తే మానవత్వం, దేశమే గుర్తుండాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వీధుల వారీగా కులాలను విడగొట్టి మాట్లాడే విధానంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. తాము ఓట్ల కోసం కాకుండా, సమాజానికి ఏది సరైనదో అదే మాట్లాడతామన్నారు.

జనసేన సంస్థాగత నిర్మాణం

పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన ‘సాధక్స్’ (కార్యకర్తలు), వీరమహిళల త్యాగాలకు సంస్థాగత గుర్తింపు ఇచ్చేందుకే ఈ ‘సమాచార సేకరణ కమిటీలు’ ఏర్పాటు చేసినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ కమిటీల్లో బయటి వ్యక్తులు ఎవరూ లేరని.. క్షేత్రస్థాయిలో నిస్వార్ధంగా పనిచేసిన గృహిణులు, ఆటో డ్రైవర్లు, టీ కొట్టు నడిపేవారు, రోజువారీ కూలీలే ఉన్నారని స్పష్టం చేశారు.

ఈ కమిటీల ప్రధాన బాధ్యత నాయకులను ఎంపిక చేయడం కాదు. పార్టీ కోసం కష్టపడిన వారి వివరాలను పారదర్శకంగా సేకరించి రూల్ బుక్ ప్రకారం తన పరిశీలనకు పంపడం మాత్రమేనని వివరించారు. ఎమ్మెల్యేలతో లేదా పెద్దలతో పరిచయాలు ఉన్నవారిని కాకుండా, తెనాలిలో రోజంతా టైలరింగ్ పని చేసుకుంటూ సాయంత్రం వేళల్లో పార్టీ కోసం సభ్యత్వాలు చేయించిన శివనాగరాజు లాంటి నిజమైన కష్టజీవులను గుర్తించడానికే ఈ కమిటీలను వేసినట్లు చెప్పారు.

ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 28 మంది సభ్యులతో (ఒక పరిశీలకుడు, ముగ్గురు సీనియర్ నాయకులు, ముగ్గురు సీనియర్ సాధకులు, 21 మంది సాధకులు) ఈ కమిటీ పనిచేస్తుందని, వీరికి సహాయంగా తన కార్యాలయం నుంచి మరో 5 గురు సభ్యుల సపోర్ట్ టీమ్ ఉంటుందని తెలిపారు. పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే జనసేనకు కోటి మంది సభ్యులు ఉండేవారని, ప్రస్తుతం ఉన్న 18,000 మంది సాధకులను సరిగ్గా నడిపిస్తే అది ఒక పెద్ద సైన్యంగా మారుతుందని, భవిష్యత్ యుద్ధానికి సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ట్యాగ్‌లు
PawanKalyanJanaSenaJanaSenaPartyJSPAndhraPradeshAPPoliticsTeluguPoliticsPoliticalNewsLeadershipPartyBuildingSocialHarmonyUnity
కులాలను విడగొట్టే రాజకీయాలు చేయను.. కలపడానికే నా ప్రయత్నం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ - Tholi Paluku