Let's talk: editor@tmv.in
అప్పుడే పుస్తకం రాయాలనుకున్నా: జనరల్‌ నరవణే

అప్పుడే పుస్తకం రాయాలనుకున్నా: జనరల్‌ నరవణే

Pinjari Chand
23 ఏప్రిల్, 2026

మాజీ సైన్యాధిపతి జనరల్ మనోజ్ నరవణే తన కొత్త పుస్తకానికి ఆలోచన ఎలా వచ్చిందో మీడియా ముఖంగా వెల్లడించారు. రెండేళ్ల క్రితం ఓ మిత్రుడి ఇంట్లో శశి థరూర్ రచించిన ‘ ఏ వండర్‌‌ల్యాండ్‌ ఆఫ్‌ వర్డ్స్‌’పుస్తకం చూసినప్పుడే తనకు ఈ ఆలోచన కలిగిందని చెప్పారు. ఆ పుస్తకం ఇంగ్లీష్ భాషలోని వినూత్న పదాలపై వ్యాసాల సమాహారం కాగా, అదే తరహాలో భారత సాయుధ దళాల గాథలు, ఊహలు, విచిత్ర సంఘటనలపై పుస్తకం రాయాలనే ఆలోచన అప్పుడే తనలో మొలకెత్తిందని నరవణే పేర్కొన్నారు. భారత సైన్యం, నౌకాదళం, వైమానిక దళాల్లో ప్రసిద్ధి చెందిన ఎన్నో గాథలు, ఆసక్తికర కథనాలు, వినోదాత్మక సంఘటనలను ఆయన తన కొత్త పుస్తకంలో పొందుపరిచారు. ది క్యూరియస్‌ అండ్‌ ది క్లాసిఫైడ్: అన్‌ ఎర్తింగ్‌ మిలటరీ మైథ్ అండ్‌ మిస్టరీస్‌ పేరుతో వచ్చిన ఈ పుస్తకాన్ని రూప పబ్లికేషన్స్‌ ఇండియా ప్రచురించింది.

పుస్తక పరిచయంలో నరవణే వ్యాఖ్యలు

ఇంగ్లీష్ భాషలోని విచిత్రాలపై ఇంత ఆసక్తికర పుస్తకం రాయగలిగితే, భారత సైన్యంపై ఎందుకు అలాంటి పుస్తకం రాయకూడదు? అనే ఆలోచన అప్పుడే కలిగిందని తెలిపారు. అయితే 2025 మధ్యలోనే ఈ ఆలోచనపై సీరియస్‌గా పని చేయగలిగానని చెప్పారు. నరవణే డిసెంబర్ 2019 నుంచి ఏప్రిల్ 2022 వరకు భారత సైన్యాధిపతిగా పనిచేశారు.

ఈ పుస్తకంలో ‘చక్ దే ఫట్టే’ అనే నినాదం 17–18వ శతాబ్దాల సిక్కు సైన్యం నుంచి ఎలా పుట్టిందో, అలాగే సైనికుల్లో ఉత్సాహాన్ని నింపే ‘బద్లురామ్ కా బదన్’ పాట వెనుక ఉన్న కథను కూడా వివరించారు. ఈ పాటకు ప్రేరణగా నిలిచిన బద్లురామ్ 1944లో జరిగిన కోహిమా యుద్ధంలో వీరమరణం పొందిన అస్సాం రెజిమెంట్ రైఫిల్మన్. ‘బద్లురామ్ కా బదన్’ ఇప్పుడు అస్సాం రెజిమెంట్‌ రెజిమెంటల్ ఆంథమ్‌గా మారింది. షిల్లాంగ్‌లోని హ్యాపీ వ్యాలీలో జరిగే అట్టెస్టేషన్ పరేడ్‌లో ఈ పాటను ఉత్సాహంగా ఆలపిస్తారు. బద్లురామ్ మరణించిన తరువాత కూడా అతని పేరు రేషన్ జాబితాలో నుంచి తొలగించలేదు. బద్లురామ్ పేరుతో వచ్చిన అదనపు రేషన్ నిల్వలు అనేక సైనికుల ప్రాణాలను కాపాడినట్టు పుస్తకంలో పేర్కొన్నారు. ఈ సంఘటనతో ప్రేరణ పొందిన మేజర్ ఎం.టి. ప్రోక్టర్ 1946లో ‘బద్లురామ్ కా బదన్’ అనే మార్చింగ్ సాంగ్‌ను రచించారు. అలాగే పుస్తకంలో బాబా హర్భజన్ విశ్వాస గాథ, ఐఎన్‌ఎస్‌ కుర్కీ దురంతం, వైమానిక దళ సిబ్బంది కాల్ సైన్స్ కథలు, ‘పెడోంగి’ అనే సైనిక గాడిద ధైర్య గాథ వంటి ఎన్నో అంశాలను చేర్చినట్టు ప్రచురణ సంస్థ తెలిపింది. ఈ కథలు సాధారణ పాఠకులకు అర్థమయ్యేలా, వినోదాత్మకంగా ఉండాలని, అయితే సైనిక ధర్మాన్ని ప్రతిబింబించేలా ఉండాలని నరవణే చెప్పారు. అవి పాత ఆర్కైవ్‌లలో దాగి ఉన్న వివరాలు కాకుండా, ప్రజలకు దగ్గరగా ఉండే కథలుగా ఉండాలని ఉద్దేశించానన్నారు. ఇవి అన్నీ నిజ జీవిత సంఘటనల ఆధారంగా పుట్టిన కథలేనని, కాలక్రమేణా చెప్పుకుంటూ చెప్పుకుంటూ కొంత అలంకారం చేరిందని పేర్కొన్నారు.

ఇటీవల తన వివాదాస్పద స్మృతిగ్రంథం ‘ఫోర్‌‌ స్టార్స్‌ ఆఫ్‌ డెస్టినీ’ అనధికార కాపీలు ప్రచారంలో ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో, పెంగ్విన్‌ రాండమ్‌ హౌస్‌ ఇండియాఈ పుస్తకానికి తమకే ప్రత్యేక హక్కులు ఉన్నాయని, ఇప్పటివరకు ఇది అధికారికంగా ప్రచురించలేదని ఫిబ్రవరిలో స్పష్టం చేసింది. ఈ స్మృతిగ్రంథం ప్రింట్‌,, డిజిటల్ రూపంలో గానీ ఇప్పటివరకు విడుదల కాలేదని స్పష్టంచేశారు.