Let's talk: editor@tmv.in
కాంగ్రెస్ మహిళా వ్యతిరేకి అని నేనెప్పుడూ అనలేదు: శశి థరూర్

కాంగ్రెస్ మహిళా వ్యతిరేకి అని నేనెప్పుడూ అనలేదు: శశి థరూర్

Panthagani Anusha
29 ఏప్రిల్, 2026

కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేకి అని తాను ఎప్పుడూ వ్యాఖ్యానించలేదని ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజూ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. మంగళవారం ఎక్స్ వేదికగా స్పందించిన థరూర్ మహిళా హక్కులు, మహిళా రిజర్వేషన్ల సాధనలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అగ్రభాగాన నిలిచిందని గుర్తుచేశారు. ఆ ఫోటోలో తనతో ఉన్న మిగతా ఏడుగురు సభ్యులు కూడా తాను అటువంటి వ్యాఖ్యలు చేయలేదనడానికి సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

రాజకీయ వివాదం - థరూర్ కౌంటర్

ఏప్రిల్ 18న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా రిజిజూ, థరూర్ మధ్య జరిగిన సంభాషణ ఈ వివాదానికి దారితీసింది. అయితే రిజిజూ పేర్కొన్నట్లుగా తాను కాంగ్రెస్‌ను విమర్శించలేదని థరూర్ క్లారిటీ ఇచ్చారు. "నేను అలా అన్నానని చెప్పడం పూర్తిగా అవాస్తవం. కాంగ్రెస్ మహిళా వ్యతిరేక పార్టీ అని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించను. సోనియా గాంధీ నాయకత్వంలోనే మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిందనే విషయాన్ని మర్చిపోకూడదు" అని ఆయన ధ్వజమెత్తారు. మహిళా పురోగతిని డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం ప్రజాస్వామ్యానికి చేటు చేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

లోక్‌సభలో వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు

ఇదిలా ఉండగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేలా రూపొందించిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు లోక్‌సభలో తిరస్కరణకు గురైంది. ఈ బిల్లు ప్రకారం లోక్‌సభ సీట్ల సంఖ్యను 543 నుండి 816కి పెంచి 2029 నాటికి మహిళా కోటాను అమలు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. మంగళవారం జరిగిన ఓటింగ్‌లో మొత్తం 528 మంది సభ్యులు పాల్గొనగా బిల్లుకు అనుకూలంగా 298 మంది, వ్యతిరేకంగా 230 మంది ఓటు వేశారు. అయితే రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ (352 ఓట్లు) రాకపోవడంతో బిల్లు వీగిపోయింది.

ప్రజాస్వామ్య విజయమన్న కాంగ్రెస్

మహిళా రిజర్వేషన్‌ను డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) ప్రక్రియతో అనుసంధానం చేయడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనలు రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించింది. బిల్లు తిరస్కరణకు గురవ్వడాన్ని ప్రజాస్వామ్యం, రాజ్యాంగం సాధించిన విజయంగా కాంగ్రెస్ అభివర్ణించింది. మహిళలకు రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని దాన్ని ఇతర నిబంధనలతో ముడిపెట్టి కాలయాపన చేయవద్దని పార్టీ డిమాండ్ చేసింది.

కాంగ్రెస్ మహిళా వ్యతిరేకి అని నేనెప్పుడూ అనలేదు: శశి థరూర్ - Tholi Paluku