
సీఎం విజయ్‌పై నాకేం అసూయ లేదు: రజనీకాంత్
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ పై తనకు ఎలాంటి "అసూయ" లేదని సూపర్ స్టార్ రజనీకాంత్ స్పష్టం చేశారు. ఇటీవల డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్‌తో తాను జరిపిన భేటీ కేవలం స్నేహపూర్వకమైనదే తప్ప, దాని వెనుక ఎలాంటి రాజకీయ వ్యూహాలు లేవని ఆయన తేల్చి చెప్పారు.
ఆదివారం చెన్నైలోని తన పోయెస్ గార్డెన్ నివాసంలో రజనీకాంత్ మీడియాతో మాట్లాడారు. స్టాలిన్‌తో భేటీ వెనుక విజయ్ ముఖ్యమంత్రి పదవికి అడ్డుకట్ట వేయాలనో, లేదా పార్టీల విలీనం కోసమో జరిగిన ప్రయత్నమంటూ వస్తున్న వార్తలను ఆయన పూర్తిగా కొట్టిపారేశారు.
విజయ్‌పై అసూయ ఉందన్న వార్తలను పూర్తిగా కొట్టిపారేసిన రజనీకాంత్, తనకు విజయ్ చిన్నప్పటి నుంచే తెలుసని చెప్పారు. “నాకు ఆయనపై ఎందుకు అసూయ ఉంటుంది? 52 ఏళ్ల వయసులోనే ముఖ్యమంత్రిగా ఎదిగి ఎంతో సాధించాడు. ఆ స్థాయిలో ఆయన సాధించిన విజయాలు దివంగత మహానటులు ఎంజీఆర్, ఎన్టీఆర్‌లను కూడా మించిపోయాయి,” అని అన్నారు. తమిళ సినీ దిగ్గజం ఎంజీఆర్, తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌లు సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రులైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ కాంగ్రెస్, వీసీకే, వామపక్షాలు, ఐయూఎంఎల్ మద్దతుతో 108 స్థానాలు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు రజనీకాంత్ అభినందనలు తెలిపారు. ద్రావిడ పార్టీలైన డీఎంకే, ఏఐఏడీఎంకేలను ఓడించి అధికారంలోకి రావడం గొప్ప విజయమని ఆయన కొనియాడారు. తాను ఆరోగ్య కారణాల వల్ల రాజకీయాల్లోకి రాలేదని రజనీకాంత్ వెల్లడించారు. అభిమానులు తమకు నచ్చిన రాజకీయ పార్టీలకు మద్దతు ఇవ్వొచ్చని సూచించారు. అలాగే ప్రజలు విజయ్‌కు కనీసం రెండేళ్ల సమయం ఇచ్చి ఆయన పాలనను అంచనా వేయాలని కోరారు.
