


సమాజంలో మార్పు కోసమే విద్యాశాఖను ఎంచుకున్నా: మంత్రి నారా లోకేష్
సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకే తాను అత్యంత సవాళ్లతో కూడిన విద్యాశాఖను ఎంచుకున్నానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అందరం కలిసి ‘ఏపీ మోడల్ ఎడ్యుకేషన్’ సాధిద్దామని ఆయన పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం కొక్కిలిగడ్డలో పి-4 పథకంలో భాగంగా దాతల సహకారంతో రూ. 1.4 కోట్లతో నూతనంగా నిర్మించిన జెడ్పీ హైస్కూలు భవనాలను బుధవారం ఉదయం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ, గత రెండేళ్లలో విద్యావ్యవస్థలో మౌలిక వసతుల, సంస్కరణలన్నీ పూర్తి చేశామని, ఇకపై ఉపాధ్యాయులు కేవలం విద్యార్థుల అభ్యసన ఫలితాల మెరుగుదలపైనే పూర్తి శ్రద్ధ వహించాలని సూచించారు. ఉపాధ్యాయులు తమ సమస్యల కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా ఈ ‘లీప్ యాప్’ ద్వారా తనకే తెలియజేయవచ్చన్నారు. వచ్చే నెల 16, 17, 18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా 'పేరెంట్ - టీచర్ మీటింగ్స్' నిర్వహిస్తామని, తల్లిదండ్రులతో ఈ యాప్ డౌన్ లోడ్ చేయించాలని కోరారు. విద్యార్థుల సామర్థ్యాన్ని పెంచేందుకు బ్రిడ్జి కోర్సు మెటీరియల్ ఇస్తామని, ముఖ్యంగా టెన్త్ క్లాస్ బాలికలు ఫెయిల్ అయితే సామాజిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తుచేశారు. త్వరలో 'క్లిక్కర్ టెక్నాలజీ', 'పాల్ ల్యాబ్'లను అందుబాటులోకి తెస్తామన్నారు.
మీరు చదవకపోతే నాకు మైనస్ మార్కులు!
తొమ్మిది, పదో తరగతి విద్యార్థులతో మంత్రి లోకేష్ చమత్కరిస్తూ.. మీరు బాగా చదివి మంచి ఫలితాలు సాధిస్తే ముఖ్యమంత్రి నాకు మంచి మార్కులు వేస్తారు. మీరు చదవకపోతే నాకు మైనస్ మార్కులు పడతాయి. నా భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. అనడంతో సభలో నవ్వుల సందడి నెలకొంది. ఇప్పటికే యూనిఫాం, పుస్తకాలు ఇచ్చామని, త్వరలోనే 'సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా కిట్స్', బూట్లు అందజేస్తామని చెప్పారు. పాఠశాల నిర్మాణానికి రూ. 1.4 కోట్లు సహకరించిన 'శ్రీ భ్రమరాంబిక ప్రాసెసింగ్ కంపెనీ' చైర్మన్ కామరాజుగడ్డ బాల వెంకట సత్య ప్రసాద్‌తో పాటు ఇతర దాతలను మంత్రి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్, కలెక్టర్ డీకే బాలాజి, ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
