

పుప్పాలగూడలో హైడ్రా భారీ ఆపరేషన్.. 200 ఎకరాల ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్
ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున హైడ్రా నగరంలో ఒక భారీ ఆపరేషన్ నిర్వహించింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ - ఖాజాగూడ సరిహద్దుల్లోని అత్యంత విలువైన సుమారు 200 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు, 250 కోట్ల సంవత్సరాల నాటి చారిత్రక రాళ్ల గుట్టలు, అతిపురాతన రాతి గుహలు అక్కడి ప్రకృతిని హైడ్రా కాపాడింది. ఈ రక్షిత భూమి విలువ సుమారు రూ.30వేల కోట్ల విలువైన భూమిని కాపాడినట్లు హైడ్రా తెలిపింది.
గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ 200 ఎకరాల భూమిని హెచ్ఎండీఏకు కేటాయించింది. అయితే హద్దులు గుర్తించి ఫెన్సింగ్ వేయడంలో జాప్యం జరగడంతో ఇవి కబ్జాలకు దారితీశాయి. చారిత్రక గుట్టలను కాపాడాలని దశాబ్దాలుగా పోరాడుతున్న ‘సొసైటీ టూ సేవ్ రాక్స్’ ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించగా, 2019లోనే వీటిని రక్షించాలని మున్సిపల్, రెవెన్యూ శాఖలను కోర్టు ఆదేశించింది. ఇటీవల రాక్ సొసైటీ ప్రతినిధులు ‘హైడ్రా ప్రజావాణి’లో ఫిర్యాదు చేయడంతో, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, ప్రభుత్వ భూమిగా నిర్ధారించుకుని శుక్రవారం హైడ్రా సిబ్బంది ఫెన్సింగ్ వేశారు.
రెవెన్యూ రికార్డుల ప్రకారం మొత్తం 293.05 ఎకరాల ప్రభుత్వ భూమిలో కొంత భాగం వివిధ అవసరాలకు కేటాయించగా, మిగిలిన 200 ఎకరాలు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్నాయి. ఈ భూమిలోని చారిత్రక రాతి నిర్మాణాలు, ఆలయాలు, సహజసిద్ధమైన కొండలను హైడ్రా సంరక్షించిందని పర్యావరణవేత్తలు అభినందించారు. అదేవిధంగా సమీపంలోని భగీరథమ్మ చెరువును కూడా హైడ్రా పునరుద్ధరిస్తోంది. కొండలు, చెరువు కలయికతో ఈ ప్రాంతం భవిష్యత్తులో ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని స్థానికులు పేర్కొన్నారు.
