

హైడ్రా ఉక్కుపాదం.. 8 క్రషింగ్ యూనిట్లు నేలమట్టం
నగర పరిసర ప్రాంతాల్లో అనుమతులు లేకుండా నడుస్తున్న క్రషింగ్ యూనిట్లు, ఆర్‌ఎంసీ ప్లాంట్లపై హైడ్రా మంగళవారం విస్తృత చర్యలు చేపట్టింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మైనింగ్, రెవెన్యూ శాఖల ఫిర్యాదుల మేరకు ఒకే రోజు నాలుగు ప్రాంతాల్లో ఆపరేషన్లు నిర్వహించి అక్రమ నిర్మాణాలను తొలగించింది.
రంగారెడ్డి జిల్లా గౌలిదొడ్డి, వట్టినాగులపల్లి, గోపన్నపల్లి, శంషాబాద్ మండలంలోని కొత్వాల్‌గూడ ప్రాంతాల్లో ఏళ్లుగా కొనసాగుతున్న 8 క్రషింగ్ యూనిట్లపై హైడ్రా బృందాలు దాడులు చేశాయి. అదే సమయంలో 13 రెడీ మిక్స్ కాంక్రీట్ (ఆర్‌ఎంసీ) ప్లాంట్లలో మూడు ప్లాంట్లను నేలమట్టం చేయగా, మిగిలిన 10 ప్లాంట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. అధికారులు కోరిన మేరకు అవసరమైన సిబ్బంది, యంత్ర సామగ్రితో హైడ్రా ఈ ఆపరేషన్‌ను నిర్వహించింది. అధికారుల పరిశీలనలో ఈ క్రషింగ్ యూనిట్లలో ఏ ఒక్కదానికి కూడా మైనింగ్ శాఖ, పీసీబీ అనుమతులు లేవని తేలింది. పీసీబీ జారీ చేసిన నోటీసులు, రెవెన్యూ శాఖ ఆదేశాలు, మైనింగ్ శాఖ అభ్యంతరాలను పట్టించుకోకుండా యూనిట్లు కొనసాగుతున్నట్లు వెల్లడైంది. బినామీ పేర్లతో, పెద్ద సంస్థల అండదండలతో ఈ యూనిట్లు నడుస్తున్నాయని అధికారులు తెలిపారు.
సహజసిద్ధమైన కొండలు, గుట్టలను ఎలాంటి అనుమతులు లేకుండా ధ్వంసం చేసి రాత్రింబవళ్లు రాళ్లను క్రషింగ్ చేయడం వల్ల తీవ్ర వాయు కాలుష్యం ఏర్పడుతోందని సంబంధిత శాఖలు ఫిర్యాదులో పేర్కొన్నాయి. ఈ అక్రమ కార్యకలాపాలన్నీ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోనే సాగుతుండటం గమనార్హం. భవిష్యత్తులో మళ్లీ స్టోన్ క్రషింగ్ జరగకుండా యంత్ర పరికరాలను కూడా ధ్వంసం చేశారు.
భగత్‌సింగ్ స్టోన్ క్రషర్, ఎస్‌వీకే, పరమేశ్వర్ స్టోన్, పృథ్వి, గ్రేట్ ఇండియా మైనింగ్, ఆర్ మిల్లర్, తిరుమల మెటల్ ఇండస్ట్రీకి చెందిన యూనిట్లతో పాటు బీఎస్‌ఆర్, అల్ట్రాటెక్, ఏసీసీ రెడీమిక్స్ ప్లాంట్లు కూడా ఈ చర్యల్లో భాగమయ్యాయి. కొత్వాల్‌గూడలో దాదాపు 16 ఎకరాల విస్తీర్ణంలో సాగుతున్న కార్యకలాపాల్లో సుమారు ఏడు ఎకరాల మేర కొండలను పూర్తిగా తవ్వివేసిన ఆనవాళ్లు గుర్తించారు. ప్రకృతి విధ్వంసాన్ని అడ్డుకున్న హైడ్రా చర్యలను స్థానికులు అభినందించారు.
