
శిథిలావస్థలో ఉన్న భవనాలపై ‘హైడ్రా’ నిఘా
నగరంలో పాత, శిథిలావస్థకు చేరిన భవనాల వల్ల సంభవించే ప్రమాదాలను అరికట్టేందుకు హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. జనసంచారం ఉన్న ప్రాంతాల్లో కూలడానికి సిద్ధంగా ఉన్న కట్టడాలను గుర్తించి, ముందస్తుగా చర్యలు తీసుకోవడానికి ప్రజల భాగస్వామ్యం కోరుతూ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇటీవల బెంగళూరులోని శివాజీనగర్‌లో కురిసిన భారీ వర్షానికి పాత ప్రహరీ గోడ కూలి ఏడుగురు మరణించిన ఘటనను హైడ్రా ఈ సందర్భంగా గుర్తుచేసింది. మన నగరంలో కూడా గతంలో ఇటువంటి విషాదాలు చోటుచేసుకున్న నేపథ్యంలో, అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కేవలం వర్షాకాలంలోనే కాకుండా, అకాల వర్షాల వల్ల కూడా పాత భవనాలు ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
సమాచారం ఎలా ఇవ్వాలి?
మీ పరిసరాల్లో ముప్పు పొంచి ఉన్న పాత భవనాలు లేదా శిథిల కట్టడాలు ఉంటే వెంటనే 9000113667 నంబర్‌కు సమాచారం అందించాలని హైడ్రా కోరింది. సదరు భవనం ఉన్న ప్రాంతం, దాని ఫోటో, కరెంట్ లొకేషన్‌ను పై వాట్సాప్ నంబర్‌కు పంపాలి. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని అధికారులు హామీ ఇచ్చారు. ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి శిథిల భవనాల వివరాలను సేకరిస్తున్నామని, ప్రజలు కూడా సహకరిస్తే ప్రాణనష్టాన్ని నివారించవచ్చని హైడ్రా స్పష్టం చేసింది. భద్రత దృష్ట్యా పాత భవనాల యజమానులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
