Let's talk: editor@tmv.in
వర్షాకాల విపత్తులను ఎదుర్కొనేందుకు హైడ్రా పూర్తి సన్నద్ధం: మంత్రి పొన్నం ప్రభాకర్
వర్షాకాల విపత్తులను ఎదుర్కొనేందుకు హైడ్రా పూర్తి సన్నద్ధం: మంత్రి పొన్నం ప్రభాకర్

వర్షాకాల విపత్తులను ఎదుర్కొనేందుకు హైడ్రా పూర్తి సన్నద్ధం: మంత్రి పొన్నం ప్రభాకర్

Gaddamidi Naveen
21 జూన్, 2026

రాబోయే వర్షాకాలంలో సంభవించే ప్రకృతి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించేందుకు హైడ్రా పూర్తిస్థాయిలో సన్నద్ధమైందని హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జలవిహార్‌లో నిర్వహించిన హైడ్రా మాన్సూన్ రెస్పాన్స్ బృందాల సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్, అడిషనల్ డైరెక్టర్ పాపయ్యతో పాటు పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వర్షాకాల అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు హైడ్రా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందించామని తెలిపారు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హైడ్రా బృందాలు ముందుండి సేవలు అందిస్తాయని చెప్పారు. హైడ్రా వద్ద అత్యాధునిక యంత్రాలు, భారీ డీ-వాటరింగ్ పంపులు, అత్యవసర స్పందన వాహనాలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి వెల్లడించారు. నగరవ్యాప్తంగా గుర్తించిన 913 నీటి నిల్వ ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు 51 డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్‌ఎఫ్) బృందాలు, 300 మాన్సూన్ రెస్పాన్స్ టీమ్‌లు, 889 స్టాటిక్ టీమ్‌లు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. చెట్లు కూలిన ఘటనలకు తక్షణ స్పందన కోసం 20 బైక్ క్విక్ రెస్పాన్స్ యూనిట్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నీటిని వేగంగా తొలగించేందుకు 371 డీ-వాటరింగ్ పంపులను వ్యూహాత్మక ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. నగరంలోని 60 ఫ్లైఓవర్లు, 38 అండర్‌పాస్‌లు, 705 చెరువులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు.

అమీర్‌పేట్, మైత్రీవనం, మధురానగర్, ప్యారడైజ్–పట్నీ–రసూల్‌పురా నాలా మార్గాల్లో చేపట్టిన డీసిల్టింగ్, ఆక్రమణల తొలగింపు, డ్రైనేజీ పునరుద్ధరణ పనులతో వరద ముప్పు గణనీయంగా తగ్గిందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో 24 గంటల పాటు పనిచేస్తున్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు
HYDRAAHyderabadMonsoonPreparednessMonsoon2026DisasterManagementFloodPreventionUrbanFloodingRainAlertMonsoonSafetyEmergencyResponse
వర్షాకాల విపత్తులను ఎదుర్కొనేందుకు హైడ్రా పూర్తి సన్నద్ధం: మంత్రి పొన్నం ప్రభాకర్ - Tholi Paluku