Let's talk: editor@tmv.in
శంషాబాద్‌లో ‘హైడ్రా’ ధాటి.. రూ.90 కోట్ల భూమి స్వాధీనం!
శంషాబాద్‌లో ‘హైడ్రా’ ధాటి.. రూ.90 కోట్ల భూమి స్వాధీనం!

శంషాబాద్‌లో ‘హైడ్రా’ ధాటి.. రూ.90 కోట్ల భూమి స్వాధీనం!

Sirisha B
23 ఏప్రిల్, 2026

ప్రభుత్వ భూముల పరిరక్షణలో దూసుకుపోతున్న హైడ్రా.. తాజాగా శంషాబాద్ మండలంలో భారీ ఆపరేషన్ చేపట్టింది. కోర్టు స్టే ఉత్తర్వులను లెక్కచేయకుండా ఆక్రమణకు గురైన 9.05 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. ఈ భూమి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.90 కోట్లకు పైగా ఉంటుందని రెవెన్యూ అధికారులు అంచనా వేస్తున్నారు.

శంషాబాద్ మండల పరిధిలోని సర్వే నంబర్ 626/2లో మొత్తం 176.05 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 166 ఎకరాలను అటవీ అభివృద్ధి సంస్థకు ప్రభుత్వం కేటాయించింది. మిగిలిన 9.05 ఎకరాల భూమిపై కొందరు వ్యక్తులు ‘సీఎస్-14’ (నిజాం కాలం నాటి భూమి) పేరిట హక్కులు ఉన్నాయని వాదిస్తున్నారు .

అయితే రెవెన్యూ అధికారులు మాత్రం ఇది ప్రభుత్వ భూమేనని స్పష్టం చేస్తున్నారు. ఈ వివాదం ప్రస్తుతం హైకోర్టులో విచారణలో ఉంది. తుది తీర్పు వెలువడే వరకు యథాతథ స్థితి కొనసాగించాలని, ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

అయినా కూడా ఆ ఉత్తర్వులను పట్టించుకోకుండా... ప్రజావాణిలో రంగారెడ్డి కలెక్టర్‌కు, శంషాబాద్ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. తాజమ్ముల్ మొయినుద్దీన్ ఖాన్ అనే వ్యక్తి భూమిని దున్నించి లేఅవుట్‌గా మార్చాడని సమాచారం అందింది.

ఫీల్డ్ ఇన్‌స్పెక్షన్‌లో రెవెన్యూ అధికారులు 9.05 ఎకరాల భూమిని దున్నించి, ప్రీకాస్ట్ గోడలతో ఆక్రమించినట్లు గుర్తించారు. దీంతో భూ ఆక్రమణ చట్టం 1905 ప్రకారం మొయినుద్దీన్ ఖాన్‌కు ఆక్రమణలు తొలగించాలని నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ ఆయన ఆదేశాలను పట్టించుకోకుండా అక్కడ కొన్ని ప్లాట్లు కూడా విక్రయించినట్లు అధికారులు గుర్తించారు.

హైడ్రా చర్యలు

పరిస్థితి తీవ్రతను గమనించిన రెవెన్యూ, మున్సిపల్ అధికారులు భూమిని రక్షించాలని కోరుతూ హైడ్రాకు లేఖ రాశారు. దీంతో బుధవారం ఉదయం భారీ బందోబస్తు మధ్య హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. అక్రమంగా నిర్మించిన ప్రీకాస్ట్ గోడలు, ఇతర నిర్మాణాలను తొలగించారు. 9.05 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూమి అని స్పష్టం చేస్తూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూముల ఆక్రమణపై ఎలాంటి రాజీ ఉండదని అధికారులు హెచ్చరించారు. కార్యక్రమంలో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.