

కోకాపేటలో హైడ్రా చర్యలు.. ఎఫ్‌టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాల తొలగింపు
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట గ్రామంలోని కొత్త చెరువు ఆక్రమణలపై హైడ్రా భారీ చర్యలు చేపట్టింది. చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్) పరిధిని కాపాడే లక్ష్యంతో చేపట్టిన ఈ ఆపరేషన్‌లో మొత్తం 22 ఎకరాల మేర ఆక్రమ నిర్మాణాలను తొలగించినట్లు అధికారులు తెలిపారు.
కోకాపేట కొత్త చెరువు మొత్తం ఎఫ్‌టీఎల్ పరిధి 72 ఎకరాలు కాగా, అందులో సుమారు 1.20 ఎకరాల వరకు గోల్డ్ ఫిష్ విల్లాస్ ప్రాజెక్ట్ కోసం ప్లే ఏరియాలు, పార్కులు వంటి నిర్మాణాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. అదేవిధంగా పలు నిర్మాణ సంస్థలు సుమారు 20 ఎకరాల మేర చెరువు భూమిని ఆక్రమించి ఫెన్సింగ్‌లు వేసి, ప్రహరీలు నిర్మించినట్లు హైడ్రా పరిశీలనలో తేలిందని పేర్కొన్నారు.
స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో హైడ్రా సంబంధిత శాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపింది. ఆక్రమణలు నిర్ధారించిన అనంతరం మంగళవారం చర్యలకు దిగింది. చెరువు పరిధిలో వేసిన ఫెన్సింగ్‌లు, రేకులతో నిర్మించిన ప్రహరీలు పూర్తిగా తొలగించి, అలాగే చెరువు హద్దులను మళ్లీ నిర్ధారించి కొత్తగా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇక కూకట్‌పల్లి మండలం ఖైతలాపూర్‌లో కూడా రహదారి ఆక్రమణలపై హైడ్రా చర్యలు తీసుకుంది. జ్యువెల్ హైట్స్ గేటెడ్ కమ్యూనిటీ ముందు సుమారు 1700 గజాల మేర రహదారి ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించి వాటిని తొలగించారు. ఇందులో భాగంగా నిర్మాణ సంస్థకు చెందిన కార్యాలయ గది, అలాగే పశువుల షెడ్డును కూడా అధికారులు తొలగించారు. స్థానికుల ఫిర్యాదుల ఆధారంగా చేపట్టిన ఈ చర్యలు ప్రాంతంలో చర్చనీయాంశంగా మారాయి. చెరువులు, రహదారులు వంటి ప్రజా ఆస్తులను కాపాడేందుకు హైడ్రా మరింత కఠిన చర్యలు కొనసాగిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
