Let's talk: editor@tmv.in
సిగ్నల్‌-ఫ్రీ నగరంగా హైదరాబాద్ అభివృద్ధి: సీఎం రేవంత్‌రెడ్డి
సిగ్నల్‌-ఫ్రీ నగరంగా హైదరాబాద్ అభివృద్ధి: సీఎం రేవంత్‌రెడ్డి

సిగ్నల్‌-ఫ్రీ నగరంగా హైదరాబాద్ అభివృద్ధి: సీఎం రేవంత్‌రెడ్డి

Gaddamidi Naveen
10 మే, 2026

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను ట్రాఫిక్ సమస్యల నుంచి విముక్తి చేసి, క్రమంగా సిగ్నల్-ఫ్రీ నగరంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. శనివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన పట్టణాభివృద్ధి అంశాలపై సమావేశమైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ'తో జరిగిన పరస్పర చర్చలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్ ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపుతూ, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్‌ను ట్రాఫిక్ రద్దీని నియంత్రించడానికి కేవలం రోడ్ల విస్తరణ మాత్రమే సరిపోదని పేర్కొన్నారు. నగర జనాభా, వాహనాల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో బస్సులు, మెట్రో, రైలు, ఇతర రవాణా మార్గాలను సమన్వయం చేసే బహుళ రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అదే సమయంలో పార్కింగ్ సమస్యను తగ్గించేందుకు నగరంలోని కీలక ప్రాంతాల్లో బహుళ అంతస్తుల పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా సమతుల్య, సమగ్ర అభివృద్ధిని సాధించేందుకు ప్రభుత్వం ‘క్యూర్, ప్యూర్, రేర్’ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఇందులో కోర్ అర్బన్ రీజియన్, పెరి-అర్బన్ రీజియన్, రూరల్ అగ్రి రీజియన్‌లుగా ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా కార్యాచరణ కొనసాగుతోందన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి మార్గదర్శకంగా ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047’ పత్రాన్ని కూడా ప్రభుత్వం రూపొందించిందని, 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు.

హైదరాబాద్‌లో తీవ్ర కాలుష్యానికి గురైన మూసీ నది పునరుజ్జీవనానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని సీఎం తెలిపారు. ముసీ నది పునరుద్ధరణతో పాటు ముసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. నగర కాలుష్యాన్ని తగ్గించేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఈవీ బస్సులను ప్రవేశపెట్టడంతో పాటు కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఆటోలకు ఉచిత రిట్రోఫిట్టింగ్ చేసి ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా తాగునీటి సరఫరా, పట్టణాభివృద్ధి, ముసీ పునరుజ్జీవనంపై అధికారులు కమిటీకి ప్రజెంటేషన్ ఇచ్చారు. హైదరాబాద్ అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం నుంచి మరింత ఆర్థిక సహాయం అందేలా సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. కమిటీ చైర్మన్ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో పాటు సభ్యులు ముసీ పునరుద్ధరణను విప్లవాత్మక నిర్ణయంగా అభినందించారు.