Let's talk: editor@tmv.in
దేశంలోనే తొలిసారి హైదరాబాద్ పోలీసింగ్‌లో ‘ఏఐ కాప్‌రైటర్’ యాప్
దేశంలోనే తొలిసారి హైదరాబాద్ పోలీసింగ్‌లో ‘ఏఐ కాప్‌రైటర్’ యాప్

దేశంలోనే తొలిసారి హైదరాబాద్ పోలీసింగ్‌లో ‘ఏఐ కాప్‌రైటర్’ యాప్

Gaddamidi Naveen
24 మే, 2026

హైదరాబాద్ నగర పోలీసింగ్ వ్యవస్థలో అత్యాధునిక సాంకేతికతకు మరొక మైలురాయి చేరింది. ప్రజలకు భాషా ఇబ్బందులు లేకుండా వేగవంతమైన సేవలు అందించేందుకు హైదరాబాద్ సిటీ పోలీస్ దేశంలోనే తొలిసారిగా ‘ఏఐ కాప్‌రైటర్’ అనే కృత్రిమ మేధ ఆధారిత బహుభాషా ఫిర్యాదు నమోదు యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్‌ను శనివారం బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ఆవిష్కరించి, దాని పనితీరును పరిశీలించారు.

నగరంలోని 80కి పైగా పోలీస్ స్టేషన్లలో ఈ యాప్‌ను అమలు చేయనున్నారు. బాధితులు తమ మాతృభాషలో మాట్లాడిన ఫిర్యాదును యాప్ వెంటనే రాత రూపంలోకి మార్చి, పోలీసులకు అర్థమయ్యే భాషలోకి అనువదిస్తుంది. తెలుగు, ఇంగ్లీష్ రాని వలస కార్మికులు, ఇతర రాష్ట్రాల ప్రజలు, పర్యాటకులు ఫిర్యాదు చేసే సమయంలో ఎదుర్కొనే సమస్యలను ఇది తగ్గించనుంది. హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీ సహా పది ప్రధాన భారతీయ భాషలను ఈ యాప్ గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

ఫిర్యాదు నమోదు ప్రక్రియను గంటల నుంచి కేవలం సెకన్ల వ్యవధికి తగ్గించేలా ఈ యాప్ పనిచేస్తుంది. మాట్లాడిన ప్రతి ఐదు సెకన్లకోసారి సమాచారం అప్‌డేట్ అవుతూ అధికారిక రికార్డుగా మారుతుంది. ఫిర్యాదు చేసిన వ్యక్తి, నిందితుడు, సాక్షుల మాటలను వేర్వేరుగా గుర్తించి నమోదు చేసే మల్టీ పార్టీ లేబులింగ్ సౌకర్యం కూడా ఇందులో ఉంది. అలాగే ఫిర్యాదు నమోదు చేసిన అధికారి వివరాలు, సమయం వంటి సమాచారం ఆటోమేటిక్‌గా పీడీఎఫ్ రూపంలో భద్రపరచబడటంతో పారదర్శకత పెరుగుతుందని అధికారులు తెలిపారు.

న్యాయానికి భాష అడ్డంకి కాకూడదు: సీపీ సజ్జనార్

ఈ సందర్భంగా సీపీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీ కావడం వల్ల తెలుగు, ఇంగ్లీష్ రాని ఇతర రాష్ట్రాల వలస కార్మికులు, పర్యాటకులు ఫిర్యాదుల నమోదులో పడుతున్న ఇబ్బందులకు, ఎఫ్‌ఐఆర్ జాప్యానికి ఈ యాప్ స్వస్తి పలకనుందని అన్నారు. బాధితులు చెప్పే ప్రతి మాటను యథాతథంగా నమోదు చేయడం వల్ల దర్యాప్తులో నాణ్యత పెరిగి, నిందితులకు శిక్ష పడే అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ముఖ్యంగా వలస కార్మికులు, మహిళలు, వృద్ధులకు పోలీసు సేవలపై భరోసా పెరుగుతుందని, పోలీసులకు టైపింగ్ భారం తగ్గుతుందని పేర్కొన్నారు.

స్మార్ట్ పోలీసింగ్‌లో భాగంగా హైదరాబాద్ పోలీస్ ఇప్పటికే పలు ఏఐ సాంకేతికతలను విజయవంతంగా అమలు చేస్తోంది. సైబర్ క్రైమ్ ఫిర్యాదుల కోసం 'సి-మిత్ర', సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బందికి పారదర్శకంగా విధులు కేటాయించే ఆటోమేటెడ్ విధానం, సోషల్ మీడియాలో మహిళలు, చిన్నారుల భద్రతకు విఘాతం కలిగించే అంశాలను పర్యవేక్షించడానికి 'సాక్-ఐ' వంటి ఏఐ యాప్‌లను వాడుతోంది. తాజాగా ‘ఏఐ కాప్‌రైటర్’ రాకతో ఆధునిక పోలీసింగ్‌లో సరికొత్త అధ్యాయం మొదలైందని సీపీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు సీపీలు ఎం.శ్రీనివాసులు, తఫ్సీర్ ఇక్బాల్, డీసీపీ రూపేష్, ఐటీ సెల్ అధికారులు పాల్గొన్నారు.