Let's talk: editor@tmv.in
స్పీడ్‌పోస్ట్‌తో దేశవ్యాప్తంగా గంజాయి డెలివరీ.. భారీ డ్రగ్స్ సిండికేట్‌ను ఛేదించిన హైదరాబాద్ పోలీసులు
స్పీడ్‌పోస్ట్‌తో దేశవ్యాప్తంగా గంజాయి డెలివరీ.. భారీ డ్రగ్స్ సిండికేట్‌ను ఛేదించిన హైదరాబాద్ పోలీసులు

స్పీడ్‌పోస్ట్‌తో దేశవ్యాప్తంగా గంజాయి డెలివరీ.. భారీ డ్రగ్స్ సిండికేట్‌ను ఛేదించిన హైదరాబాద్ పోలీసులు

Dantu Vijaya Lakshmi Prasanna
3 జులై, 2026

పోస్టల్ సేవలను అడ్డాగా చేసుకుని దేశవ్యాప్తంగా గంజాయిని డోర్‌స్టెప్ డెలివరీ చేస్తున్న భారీ అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను హైదరాబాద్ నగర పోలీసులు ఛేదించారు. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఈ ముఠా కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. స్పీడ్‌పోస్ట్, కొరియర్ సేవలను వినియోగించి దేశంలోని పలు రాష్ట్రాలకు గంజాయిని పంపుతున్న ఈ ముఠా నెలకు రూ.30 నుంచి రూ.35 లక్షలు, ఏడాదికి సుమారు రూ.4 నుంచి రూ.5 కోట్ల వరకు అక్రమంగా సంపాదిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

హైదరాబాద్‌లో పట్టుబడిన పార్శిల్‌తో బయటపడిన నెట్‌వర్క్

జార్ఖండ్‌లోని ఇస్రీ బజార్ పోస్టాఫీస్ నుంచి స్పీడ్‌పోస్ట్ ద్వారా హైదరాబాద్‌కు పంపిన అనుమానాస్పద పార్శిల్‌ను నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ అధికారులు అడ్డుకున్నారు. అందులో తనిఖీ చేయగా అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. అనంతరం పార్శిల్‌ను స్వీకరించేందుకు వచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, దేశవ్యాప్తంగా పనిచేస్తున్న ఈ భారీ డ్రగ్స్ సరఫరా వ్యవస్థ వెలుగులోకి వచ్చింది.

దర్యాప్తు ఆధారంగా జార్ఖండ్‌లోని గిరిడీహ్ జిల్లాకు చెందిన ప్రధాన సూత్రధారి సత్యం మిశ్రాను పోలీసులు అరెస్టు చేశారు.

పేదరికం నుంచి డ్రగ్స్ మాఫియా వరకు...

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సత్యం మిశ్రా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు మధ్యలోనే మానేశాడు. మొదట పెయింటర్‌గా, తర్వాత వాణిజ్య వాహనాల డ్రైవర్‌గా పనిచేశాడు. ఉద్యోగరీత్యా తరచూ ముంబైకి వెళ్లే సమయంలో 2018లో గంజాయికి బానిసయ్యాడు. అక్కడి డ్రగ్స్ వినియోగదారులు, పేడ్లర్లతో పరిచయాలు ఏర్పడటంతో త్వరగా డబ్బు సంపాదించాలని అక్రమ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. తన అన్న శుభమ్ మిశ్రాతో కలిసి గంజాయి వ్యాపారం ప్రారంభించిన అతడు, అనంతరం సచిన్ మిశ్రా, రాహుల్ ఝా, సంతోష్ పండిట్లను కలుపుకుని ఒక పటిష్టమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశాడు.

21 రాష్ట్రాలకు గంజాయి సరఫరా

ఈ ముఠా తమ స్వగ్రామంలోనే గంజాయి సాగు చేయడమే కాకుండా, జార్ఖండ్‌లోని ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద మొత్తంలో గంజాయిని సేకరించి దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

హైదరాబాద్, ముంబై, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రధాన నగరాలతో పాటు దాదాపు 21 రాష్ట్రాలకు గంజాయిని పంపుతున్నట్లు విచారణలో తేలింది.

స్పీడ్‌పోస్ట్‌లో "మందులు" అంటూ బుకింగ్

పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన మరో కీలక విషయం ఏమిటంటే, నిందితులు జార్ఖండ్‌లోని ఇస్రీ బజార్ ఫుస్రో బజార్ పోస్టాఫీసుల నుంచి స్పీడ్‌పోస్ట్ ద్వారా గంజాయిని పంపేవారు. అయితే పోస్టల్ అధికారులకు అనుమానం రాకుండా పార్శిల్‌లో "మందులు ఉన్నాయి" అంటూ తప్పుడు వివరాలు నమోదు చేసి బుకింగ్ చేసేవారని వెల్లడించారు.

రోజుకు 100 ఆర్డర్లు... కోట్ల రూపాయల వ్యాపారం

ఈ ముఠా రోజుకు సుమారు 80 నుంచి 100 ఆర్డర్లను దేశవ్యాప్తంగా పంపించేది. వాటిలో 8 నుంచి 10 పార్శిళ్లు స్పీడ్‌పోస్ట్ ద్వారా పంపేవారు. ఒక్కో పార్శిల్‌లో 50 గ్రాముల నుంచి 250 గ్రాముల వరకు గంజాయి ఉండేది. ఒక్కో ఆర్డర్‌కు రూ.1,500 నుంచి రూ.8,000 వరకు వసూలు చేస్తూ రోజుకు దాదాపు రూ.1 లక్ష ఆదాయం పొందేవారు. దీంతో నెలకు రూ.30-35 లక్షలు, ఏడాదికి సుమారు రూ.4-5 కోట్ల టర్నోవర్ సాధిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

పోస్టల్ సేవలతో పాటు ముంబైలో కూడా ఈ ముఠా ప్రత్యేక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుంది. అక్కడ వెయ్యిమందికి పైగా రెగ్యులర్ కస్టమర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. శుభమ్ మిశ్రా జార్ఖండ్ నుంచి రైలు మార్గంలో భారీ మొత్తంలో గంజాయిని ముంబైకి తరలించేవాడు. అక్కడ సచిన్ మిశ్రా, సంతోష్ పండిట్ ఇళ్లలో నిల్వ ఉంచి స్థానికంగా విక్రయించేవారని వెల్లడించారు.

"మ్యాంగో" అంటే గంజాయి...

పోలీసులను తప్పుదారి పట్టించేందుకు నిందితులు మెసేజింగ్ యాప్‌లలో ప్రత్యేక కోడ్ భాషను ఉపయోగించేవారు. "మ్యాంగో", "స్టిక్", "ఫ్లవర్" వంటి పదాలను గంజాయికి సంకేతాలుగా ఉపయోగించేవారు.

ఉదాహరణకు "ఒక మ్యాంగో", "మూడు మ్యాంగోలు", "పది మ్యాంగోలు" అంటూ వివిధ పరిమాణాలను సూచిస్తూ ఆర్డర్లు తీసుకునేవారని దర్యాప్తులో తేలింది.

విమానాల్లోనూ స్కానింగ్ లేకుండానే రవాణా

ఈ కేసు దర్యాప్తులో అత్యంత ఆందోళన కలిగించే అంశం కూడా బయటపడింది. గంజాయి పార్శిళ్లు రైళ్లు, వాణిజ్య విమానాల ద్వారా వివిధ రాష్ట్రాలకు తరలించినప్పటికీ, ముఖ్యంగా హైదరాబాద్‌కు విమాన మార్గంలో వచ్చిన పార్శిళ్లు ఎలాంటి స్కానింగ్ లేదా భద్రతా తనిఖీలకు గురికాలేదని పోలీసులు గుర్తించారు. దీంతో పోస్టల్ వ్యవస్థలో ఉన్న భద్రతా లోపాలు స్పష్టమయ్యాయని అధికారులు పేర్కొన్నారు.

కేంద్రానికి లేఖ.. కొరియర్ సంస్థలకు హెచ్చరిక

ఈ ఘటన నేపథ్యంలో పోస్టల్ పార్శిళ్లకు తప్పనిసరిగా స్కానింగ్, స్క్రీనింగ్ విధానాలు అమలు చేయాలని సంబంధిత కేంద్ర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు హైదరాబాద్ నగర పోలీసులు లేఖ రాయాలని నిర్ణయించారు. అలాగే నగరంలోని అన్ని కొరియర్ సంస్థలు బుక్ చేసే ప్రతి పార్శిల్‌ను, డెలివరీ చేసే ప్రతి సరుకును తప్పనిసరిగా స్కాన్ చేయాలని ఆదేశించారు. కొరియర్ సేవలపై ప్రత్యేక నిఘా కూడా పెంచినట్లు వెల్లడించారు.

పోలీసు బృందానికి కమిషనర్ అభినందనలు

ఈ భారీ డ్రగ్స్ ముఠాను ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ అధికారులను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ప్రత్యేకంగా అభినందించారు. సమగ్ర ప్రణాళిక, సమర్థవంతమైన దర్యాప్తుతో దేశవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర డ్రగ్స్ నెట్‌వర్క్‌ను ఛేదించడం గొప్ప విజయమని ఆయన ప్రశంసించారు.

ట్యాగ్‌లు
HyderabadPoliceDrugBustGanjaSmugglingSpeedPostDrugSyndicateHyderabadNewsTelanganaNewsNarcoticsHNEWCourierServicesIndiaNewsBreakingNewsJharkhandCrimeNewsPostalSecurityDrugTraffickingLawEnforcementAntiDrugOperationSpeedPostGanjaTeluguNews